- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎన్ని అడ్రస్‌లు మారిందో తెలుసా?
150 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యాలయం రానుంది. 15 ఏళ్ల పాటు నిర్మాణం చేసుకున్న ఈ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ హోదాలో ఈ నెల 15న సోనియా గాంధీ ప్రారంభించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో:
150 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యాలయం రానుంది. 15 ఏళ్ల పాటు నిర్మాణం చేసుకున్న ఈ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ హోదాలో ఈ నెల 15న సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అయిన డిసెంబర్ 28నే పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి, ఆ తర్వాత సంతాప దినాలు ఉండటంతో వాయిదా వేసింది. ఇక ఇప్పుడు సంతాప దినాలు ముగియడంతో జనవరి 15న మకర సంక్రాంతి రోజు పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్, కోట్లా మార్గ్‌కు మధ్యన ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణం గల స్థలంలో ఈ నూతనకార్యాలయాన్ని నిర్మించారు. వాస్తవానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్ వైపు ఈ కార్యాలయం ప్రధాన గేటు ఉండాలి. కానీ, తమ రాజకీయ ప్రత్యర్థి బీజేపీ సిద్ధాంత కర్త, జన్ సంఘ్ కీలక నేత అయిన దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరును పార్టీ అడ్రస్‌లో ఉపయోగించడం ఇష్టం లేక.. కోట్లా మార్గ్ వైపు ఉన్న వెనుక డోర్‌నే ప్రధాన ద్వారంగా మార్చేసింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నూతన కార్యాలయం అడ్రస్ 9ఏ, కోట్లా మార్గ్‌గా ఉండనుంది. వాస్తవానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రోడ్డు అసలు పేరు రౌజ్ అవెన్యూ రోడ్. వందేళ్ల క్రితం న్యూ ఢిల్లీ ప్రాజెక్టును పర్యవేక్షించిన సూపరింటెండింగ్ ఇంజనీర్ సర్ అలెగ్జాండర్ మెక్‌డొనాల్డ్ రౌస్ పేరు మీదుగా దీన్ని రౌజ్ అవెన్యూగా పిలిచారు. అయితే 1967 ఢిల్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో జన్ సంఘ్ విజయం సాధించిన తర్వాత.. రౌజ్ అవెన్యూను భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరు మీదకు మార్చారు. అప్పట్లో జన్‌సంఘ్ నేత విజయ్ కుమార్ మల్హోత్ర ఈ రోడ్డు పేరు మార్చడమే కాకుండా.. సమీపంలో పార్కులో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పార్క్ సరిగ్గా బీజేపీ కొత్త ఆఫీస్ ఎదురుగా ఉంది.
బ్యాక్ డోర్ అడ్రస్‌లు..
కాంగ్రెస్ పార్టీ తమ భవనానికి వెనుక డోరు అడ్రస్‌ను ఎంచుకోవడం ఇది రెండో సారి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రోడ్డులోని జవహర్ భవన్‌లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కార్యాలయం ఉంది. ఇది వాస్తవానికి 3, రైసీనా రోడ్డులో ఉఉంది. దీన్ని మొదటిగా ఏఐసీసీ కార్యాలయంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే 1991లో రాజీవ్ గాంధీ దుర్మరణం తర్వాత జవహర్ భవనాన్ని రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు అప్పగించారు. అయితే ఇది 6, రైసీనా రోడ్డులో సరిగ్గా అప్పటి ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఉన్న భవనం ఎదురుగా ఉండేది. దీంతో జవహర్ భవన్ వెనుక డోర్‌ను తమ అడ్రస్‌గా ఉపయోగించింది.
ఇక రౌజ్ అవెన్యూలోఅనేక రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలను కేటాయించారు. ది గాంధీ పీస్ ఫౌండేషన్ కూడా ఇక్కడే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీల కార్యాలయాలు కూడా ఇదే రౌస్ రోడ్డులో ఉన్నాయి. రౌస్ అవెన్యూలో పలు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. ఇక్కడ వీవీఐపీల మీద సీబీఐ, ఈడీ చేత ఫైల్ చేయబడిన కేసులు విచారణకు వస్తుంటాయి. ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) హెడ్ క్వార్టర్ అజయ్ భవన్ 1972లో 15, కోట్లా రోడ్డులో నిర్మించారు. అవిభాజ్య సీపీఐకి ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అజయ్ ఘోష్ పేరు మీద ఈ భవనాన్ని నిర్మించారు. సీపీఐ కార్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలోనే ఒకప్పుడు ఢిల్లీ సెంట్రల్ జైల్ ఉండేది. అయితే 1957లో ఈ సెంట్రల్ జైలును తీహార్‌కు తరలించారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన షేక్ మహమ్మద్ అబ్దుల్లా దేశం విడిచి పారిపోకుండా ఇక్కడ ఉన్న ఒక భవనంలోనే నిర్బంధించారు.
ఆనంద్ భవన్ నుంచి ప్రారంభమైన ప్రస్థానం..
భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం మొట్టమొదటి సారిగా అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో 1930లో ఏర్పాటు చేశారు. ఆనంద్ భవన్‌గా పిలిచే ఆ భవనాన్ని మోతీలాల్ నెహ్రూ నిర్మించారు. తన ఇంటిని ఆనుకొని ఉన్న స్థలంలోనే ఆనంద్ భవన్‌ను నిర్మించగా.. తర్వాత కాలంలో దాన్ని స్వరాజ్ భవన్‌గా పేరు మార్చి జాతికి అంకితం చేశారు. అదే మొట్టమొదటి ఏఐసీసీ కార్యాలయం. 1931లో స్వరాజ్ భవన్‌లో కాంగ్రెస్ కార్యాలయం ఉన్నప్పుడు.. అప్పటి సీడబ్ల్యూసీలో నెహ్రూ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులుగా ఉండేవారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ, మోతీలాల్ అల్లుడు రంజిత్ సీతారాం పండిట్ (నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ భర్త) సభ్యులుగా ఉన్నారు. ఇక 2025లో ఇందిరా భవన్‌లోకి కాంగ్రెస్ కార్యాలయం మారుతుండగా.. సీడబ్ల్యూసీలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సీడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ప్రస్తుతం సీడబ్ల్యూసీలో మెంబర్స్‌గా ఉన్నారు.
ఏఐసీసీ కార్యాలయం అలహాబాద్ నుంచి ఢిల్లీకి 1947లో ఉండేది. అప్పటికి దేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని వారాల సమయమే ఉంది. ఢిల్లీలోని 7, జంతర్ మంతర్ రోడ్డులో ఉన్న ఈ కొత్త కార్యాలయంలోనే దేశ విభజనకు సంబంధించిన ప్లాన్ రూపొందించబడింది. 1947 జూన్ 15న విభజనకు సంబంధించిన చర్చను సీడబ్ల్యూసీ ఈ భవనంలోనే చేసింది. ఈ కార్యాలయాన్ని మొట్టమొదటి ప్రధాని నెహ్రూ విస్తృతంగా ఉపయోగించారు. 1959లో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యాక 7, జంతర్ మంతర్ రోడ్డులోని భవన్నాన్ని తన కార్యాలయంగా ఉపయోగించారు.
మారిన అడ్రస్‌లు..
1969లో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చారు. దీంతో 7, జంతర్ మంతర్ రోడ్డులోని కార్యాలయం కాంగ్రెస్ అసలు అధ్యక్షుడు నిజలింగప్ప కంట్రోల్‌లోకి వెళ్లింది. అప్పట్లో నిజలింగప్ప నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ను ఆర్గనైజేషన్ అని పిలిచేవారు. ఇక 1977లో జనతాపార్టీలో కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) విలీనం అయ్యాక.. 7, జంతర్ మంతర్ రోడ్డులోని భవనం.. జనతాపార్టీ కార్యాలయంగా మారిపోయింది. ప్రస్తుతం ఆ భవనంలో జనతాదల్ యునైటెడ్‌తో పాటు రెంటోకిల్ పెస్ట్ కంట్రోల్, అంతిమ్ యాత్రా ఫ్యునరల్ సర్వీసెస్ కార్యాలయాలు ఉన్నాయి. 1993 నుంచి ఈ భవనం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
ఇక 1969లో ఇందిరా గాంధీ వర్గం తమ తొలి సమావేశాలను మావ్‌లంకర్ హాల్‌లో నిర్వహించారు. అప్పట్లో ఈ సమావేశానికి బాబూ జగ్జీవన్ రామ్ నేతృత్వం వహించారు. 1971లో ఎన్నికల కమిషన్ ఈ పార్టీని కాంగ్రెస్ (జగ్జీవన్ రామ్)గా గుర్తించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ (జే) క్లీన్ స్వీప్ చేసింది. రైసినా రోడ్ 3, 5కు సమీపంలోని రెండు బంగ్లాలను అప్పట్లో కాంగ్రెస్ ఉపయోగించుకుంది. ఆ తర్వాత కాలంలో ఈ రెండు బంగ్లాలు ఏఐసీసీ కార్యాలయాలుగా మారాయి. అయితే విండ్సర్ ప్లేస్‌లోని భవనం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆ తర్వాత 5, రాజేంద్ర ప్రసాద్ రోడ్డులోకి ఏఐసీసీ కార్యాయలం మారింది. గతంలో ఆ భవనం మాజీ డిప్యూటీ ప్రధాని మోరార్జీ దేశాయ్ ఉపయోగించారు. అయితే కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత మోరార్జీ దేశాయ్ పార్టీని వీడారు.
1978లో అప్పటి ఎన్నికల కమిషనర్ ఎస్ఎల్ షకేదార్.. ఇందిర వర్గాన్ని అసలైన కాంగ్రెస్‌గా గుర్తించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో పని చేయడానికి ఇందిర కాంగ్రెస్‌కు అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుంచి అదే రియల్ కాంగ్రెస్‌గా చెలామణి అవుతూ వస్తోంది. శరద్ పవార్ నేతృత్వం వహించిన ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్టు) పార్టీ 1985 డిసెంబర్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన ఒక ర్యాలీలో కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది. దీంతో కాంగ్రెస్ (సోషలిస్టు) పార్టీకి చెందిన 3, రైసినా రోడ్డులోని కార్యాలయాన్ని కాంగ్రెస్‌కు అప్పగించారు. 3, రైసీనా రోడ్డులోని జవహర్ భవన్ 1991 వరకు ఏఐసీసీకి చెందిన అనేక విభాగాల కార్యాలయాలకు నెలవుగా ఉండేది. 1991 ఎన్నికల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యాలయంలోనే పార్టీ కమ్యునికేషన్ల విభాగాన్ని నిర్వహించారు. ఇక రాజీవ్ గాంధీ పొలిటికల్ సెక్రటరీ జితేంద్ర ప్రసాద కూడా ఈ భవనాన్ని తన కార్యాలయంగా ఉపయోగించుకున్నారు.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తమ సొంత భవనంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 125వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2009 డిసెంబర్‌లో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 ఏళ్ల పాటు సాగిన ఈ భవన నిర్మాణం ఎట్టకేలకు పూర్తయ్యింది.






