Congress: ఉగ్రదాడిపై పార్టీ నేతలు గీతదాటొద్దు.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ?

by B.Srinivas |

ఉగ్రదాడిపై పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదం అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించినట్టు తెలుస్తోంది.

Congress: ఉగ్రదాడిపై పార్టీ నేతలు గీతదాటొద్దు.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ?
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రవాద దాడిపై పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదం అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీ (Congress party) ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ నేతలు బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పార్టీ అభిప్రాయానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులను అంతర్గతంగా మందలించినట్టు వెల్లడించాయి. అంతేగాక పార్టీ లైన్‌ను దాటొద్దని హెచ్చరించినట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jai ram Ramesh) ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘పార్టీ నాయకుల ప్రకటనలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు కాదు. పార్టీ నేతలకు ఇలా మాట్లాడే హక్కు ఎవరూ ఇవ్వలేదు. పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ఏఐసీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే కాంగ్రెస్ వైఖరిని తెలియజేస్తాయి. సున్నితమైన సమయంలో నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉగ్రదాడిపై అవమానకరమైన ప్రకటనలు చేశారని ఫైర్ అయ్యారు. ఖర్గే, రాహుల్ గాంధీలు సొంత నేతలను నియంత్రించలేరా అని ప్రశ్నించారు.

Next Story