Delhi Assembly Elections : ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-08 08:33:05  IST  )

గణతంత్ర భారత దేశాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా సుదీర్ఝకాలం.. సింహభాగం పాలించిన జాతీయ పార్టీగా ఘనమైన రికార్డులు సొంతం చేసుకున్న కాంగ్రెస్(Congress)పార్టీ కొన్నేళ్లుగా పార్లమెంటుతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర ఓటములు చవిచూస్తుంది.

Delhi Assembly Elections : ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్!
X

దిశ, వెబ్ డెస్క్: గణతంత్ర భారత దేశాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా సుదీర్ఝకాలం.. సింహభాగం పాలించిన జాతీయ పార్టీగా ఘనమైన రికార్డులు సొంతం చేసుకున్న కాంగ్రెస్(Congress)పార్టీ కొన్నేళ్లుగా పార్లమెంటుతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘోర ఓటములు చవిచూస్తుంది. ప్రధాని మోడీ హవా సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పరాజయాల పరంపర కొనసాగుతుండగా..ఓటముల్లోనూ ఆ పార్టీ కొత్త రికార్డులు హస్తగతం చేసుకుంటుంది. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Elections)కి జరిగిన వరుస మూడు ఎన్నికల్లోనూ ఖాతా తెరువకుండా వరుస డకౌట్లతో హ్యాట్రిక్ డకౌట్ల(Hat-Trick Ducks) అరుదైన ఘోర రికార్డు(Worst Record)ను సాధించింది.

ఢిల్లీ అసెంబ్లీకి 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఒక్క స్థానమైనా గెలవలేకపోతుంది. 2015, 2020 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారీ కూడా అదే పేలవ ప్రదర్శన చేసింది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి ఫలితాలు వెలువడగా...కాంగ్రెస్ మరోసారి సున్నాకే పరిమితమైంది. దీంతో హ్యాట్రిక్ డకౌట్ చెత్త రికార్డును చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22స్థానాలలో విజయం సాధించాయి.

వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ఈ దఫా బీజేపీ ఘన విజయంతో గద్దె దిగాల్సి వచ్చింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేని దుస్థితిని చూసి దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. గతమెంతో ఘనకీర్తీ అన్నట్లుగా తమ పార్టీ పరిస్థితి మారడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సహకారంతో కొంత పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇప్పుడు ఢిల్లీలో వరుస పరాజయాలు ఎదుర్కోంది.

Next Story