Congress: నలుగురి పేర్లు పంపాం.. కానీ, అందులో శశిథరూర్ లేరు- కాంగ్రెస్

by Shamantha N |

పాకిస్థాన్ ఉగ్రకుట్రలపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. పాక్ తీరుని ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిల పక్షబృందాలను ఏర్పాటు చేసింది.

Congress: నలుగురి పేర్లు పంపాం.. కానీ, అందులో శశిథరూర్ లేరు- కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఉగ్రకుట్రలపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. పాక్ తీరుని ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిల పక్షబృందాలను ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రతినిధుల బృందాలకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తుండగా.. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఉన్నారు. అయితే, దీనిపైన కాంగ్రెస్ స్పందించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడయా ఎక్స్ లో పోస్టు పెట్టారు. “ పాక్‌ తీరుని ప్రపంచదేశాలకు తెలిపేందుకు విదేశాలకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరారు. అదేరోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్‌ హుస్సేన్‌, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్‌ గొగొయ్‌ ఉన్నారు” అని జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా.. ఆ లిస్ట్‌లో థరూర్‌ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.

ఆపరేషన్ సిందూర్ పై..

మరోవైపు, కేంద్రానికి కాంగ్రెస్ పంపిన ఎంపీల పేర్లు ప్రశ్నార్థకంగా ఉన్నాయని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. "దౌత్య సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎంపికలు అనుమానాస్పదంగా ఉన్నాయి" అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ ఏవిధంగా మద్దతిస్తుందో.. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)తో ఉగ్రవాదంపై భారత్‌ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు ఈ బృందాలు వివరించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆ బృందంలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అందులో, శశిథరూర్‌ (కాంగ్రెస్‌), రవిశంకర్‌ ప్రసాద్‌(భాజపా), బైజయంత్‌ పాండా (భాజపా) సంజయ్‌కుమార్‌ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్‌ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది. మరోవైపు, ఈ ప్రతినిధుల బృందాల ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో కూడిన చోట నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్‌ ’’ అని థరూర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story