‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు వైరల్

by Ramesh Naini |

పార్లమెంట్ బయట కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన 'ఆఫ్ ది రికార్డ్' సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ నేతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ నేతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పార్లమెంట్ ఆవరణలో యూపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌తో పాటు మరో ఇద్దరు నేతలతో ఖర్గే మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ సంభాషణలో ఖర్గే ఎవరి పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా సెటైర్లు కనిపిస్తోంది. వైరల్ వీడియోలో ఖర్గే మాట్లాడుతూ.. ‘ఆ హైదరాబాద్ వాడిని అస్సలు రానివ్వొద్దు.. అతను వస్తే మనల్ని ఖతం చేసి పోతాడు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. ‘హైదరాబాద్ అంటేనే షేర్వానీ.. బిర్యానీ.. పరేషానీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ నేత ఒవైసీయేనా?

ఖర్గే ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించే చేశారని నెటిజన్లు బలంగా విశ్వసిస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కలిగిన ఇమ్రాన్ మసూద్ వంటి నేతలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఖర్గేకు హైదరాబాద్ అంటే ఎందుకంత భయం?’, ‘ఒవైసీ పేరు ఎత్తకుండానే ఖర్గే తనలోని భయాన్ని బయటపెట్టారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పార్లమెంట్ బయట ఖర్గే చేసిన ఈ 'ఆఫ్ ది రికార్డ్' సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Next Story