Congo: కాంగోలో ఫ్రెంచ్, యూఎస్, రువాండా ఎంబసీలపై దాడి.. రాజధాని కిన్షాసాలో తీవ్ర ఆందోళనలు

by B.Srinivas |

తూర్పు ప్రావిన్షియల్ రాజధాని గోమాను స్వాధీనం చేసుకున్న ఎం23 తిరుగుబాటుదారులకు రువాండా మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.

Congo: కాంగోలో ఫ్రెంచ్, యూఎస్, రువాండా ఎంబసీలపై దాడి.. రాజధాని కిన్షాసాలో తీవ్ర ఆందోళనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Drc)లో నిరసనకారులు రెచ్చిపోయారు. తూర్పు ప్రావిన్షియల్ రాజధాని గోమా(Goma)ను స్వాధీనం చేసుకున్న ఎం23 తిరుగుబాటుదారులకు రువాండా మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. రాజధాని కిన్షాసాలోని ఫ్రాన్స్ (France), అమెరికా (America), రువాండా (Ruwanda), ఉగాండా, కెన్యా రాయబార కార్యాలయాలపై దాడి చేశారు. యూఎస్ ఎంబసీ వద్ద టైర్లను తగలబెట్టడంతో పాటు, ఆఫీసుపై రాళ్లు విసిరారు. వివిధ ఎంబసీలకు సైతం నిప్పంటించారు. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీప్ నోయోల్ బారోట్ ఈ ఘటనలను ధ్రువీకరించారు. ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి నిప్పంటించారని తెలిపారు. ఉగాండా ఎంబసీలోని చొచ్చుకుపోయి అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

కాగా, రువాండా రెబల్స్‌ కాంగోలోని సహజవాయువుల నియంత్రణ కోసం కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగోలోని తూర్పు ప్రావిన్సీయల్ రాజధాని గోమాను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరికి రువాండా మద్దతిచ్చిందని కాంగోలోని ప్రజలు ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు. రువాండా రెబల్స్‌కి కాంగో దళాలు లొంగిపోయినట్టు పలు కథనాలు వెల్లడించాయి. అయితే కాంగో చేసిన ఆరోపణలను రువాండా ఖండించింది. కాంగో తన తూర్పు ప్రాంతాలలో శాంతిని కాపాడుకోవడంలో విఫలమైందని, తమ సరిహద్దు దగ్గర సైన్యాన్ని కూడబెట్టుకోవడంతో రువాండా భద్రతకు ముప్పు తెచ్చిందని స్పష్టం చేసింది. ఈ వివాదం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

Next Story