దేశ రాజధానిలో కలకలం.. ఫ్లైఓవర్‌పై పార్క్ చేసిన కారులో మూడు మృతదేహాలు

by Ramesh Naini |   (  Updated:2026-02-08 14:25:49  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్‌పై నిలిపి ఉంచిన ఒక కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దేశ రాజధానిలో కలకలం.. ఫ్లైఓవర్‌పై పార్క్ చేసిన కారులో మూడు మృతదేహాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్‌పై నిలిపి ఉంచిన ఒక కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. పీరాగఢి ఫ్లైఓవర్‌పై ఒక కారు చాలా సేపటి నుంచి పార్క్ చేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. మృతులలో ఒక మహిళ (40), ఒక పురుషుడు (40) ఉండగా, మరొకరు 60 ఏళ్ల వయసున్న వృద్ధుడని పోలీసులు తెలిపారు.

విష ప్రయోగం జరిగిందా?

ప్రాథమిక విచారణ ప్రకారం.. వీరి మరణానికి విష ప్రయోగమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి దోపిడీ జరిగిన ఆనవాళ్లు గానీ, పెనుగులాట జరిగిన గుర్తులు గానీ కనిపించలేదు. దీంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతులలో ఇప్పటికే ఒకరిని గుర్తించగా, మిగిలిన ఇద్దరి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కారు అక్కడికి ఎప్పుడు వచ్చింది? ఎవరు పార్క్ చేశారు? అనే విషయాలను తెలుసుకోవడానికి ఫ్లైఓవర్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story