- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నా ఆలస్యానికి పరిహారం కోరవచ్చు: సుప్రీంకోర్టు
ఫ్లాట్ స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా నిర్మాణంలో జరిగిన ఆలస్యానికి కొనుగోలుదారులు పరిహారం కోరవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు భారీ ఉపశమనాన్ని కలిగించే కీలక తీర్పు ఇచ్చింది. బిల్డర్ లేదా రియల్ ఎస్టేట్ సంస్థ నుండి ఫ్లాట్ స్వాధీనం (Possession) చేసుకున్న తర్వాత కూడా ఆలస్యానికి పరిహారం కోరే హక్కు కొనుగోలు దారులకు ఉంటుందని వెల్లడించింది. ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నంత మాత్రాన సేవలలో లోపాలు లేదా జాప్యంపై సదరు సంస్థలపై ఫిర్యాదు చేసే హక్కును కొనుగోలుదారులు కోల్పోరని స్పష్టం చేసింది. ఫ్లాట్ కొనుగోలుదారుల చేతికి వచ్చిన తర్వాత కూడా నిర్మాణంలో జరిగిన ఆలస్యానికి పరిహారం కోరుతూ కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరమ్‌లను (Consumer Forums) ఆశ్రయించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు నేషనల్ కన్స్యూమర్ డిస్‌ప్యూట్ రీడ్రెసల్ కమిషన్ (NCDRC) ఇచ్చిన 2016 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి.మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
వివాదం ఏంటీ?:
ఢిల్లీలోని ఓ కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలో 2003లో ఓ వ్యక్తి ప్లాట్‍ను కొనుగోలు చేశాడు. అయితే ఫ్లాట్ అప్పగింతలో తీవ్ర ఆలస్యం జరగడంతో సదరు కొనుగోలుదారుడు 2005లో జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఈ వివాదంపై గతంలో జిల్లా ఫోరమ్ (జూలై 2009), ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ (ఫిబ్రవరి 2013) స్పందిస్తూ.. ఇరుపక్షాల మధ్య ఉన్న ఒప్పందంలో 'ఆర్బిట్రేషన్ క్లాజ్' (మధ్యవర్తిత్వం) ఉన్నందున ఈ సమస్యను ఆర్బిట్రేషన్‌కు బదిలీ చేశాయి. దీనిపై బాధితుడు NCDRCని ఆశ్రయించగా, అతను అప్పటికే ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నాడనే కారణంతో NCDRC కూడా 2016లో అతని పిటిషన్‌ను తిరస్కరించింది.
కొనుగోలుదారుడికి సుప్రీం అండ:
ఎన్‍సీడీఆర్‍సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కొనుగోలుదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా రియల్ ఎస్టేట్ సంస్థ లేదా సొసైటీ నుండి ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నంత మాత్రాన, నిర్మాణంలో జరిగిన ఆలస్యానికి పరిహారం కోరే హక్కును కొనుగోలుదారులు కోల్పోరని స్పష్టం చేసింది. కేవలం ఇరుపక్షాల మధ్య ప్రైవేట్ ఒప్పందంలో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉందనే కారణంతో పార్లమెంట్ కల్పించిన ఒక చట్టబద్ధమైన హక్కును, న్యాయాన్ని తోసిపుచ్చలేమని ఒకసారి వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు నమోదైతే, ఒప్పందంలోని ప్రైవేట్ నిబంధనల పేరుతో కొనుగోలుదారుడిని ఫోరమ్ నుండి బయటకు పంపడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
కన్స్యూమర్ ఫోరమ్‌కు ఆదేశం:
ఈ కేసులో ఎన్‌సీడీఆర్‌సీ (NCDRC) ప్రధాన చట్టబద్ధమైన అంశాన్ని వదిలేసి, ఫ్లాట్ ను స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి వినియోగదారుడు కాదు అనే తప్పుడు కారణంతో పిటిషన్‌ను కొట్టేసింది. అసలు ఆలస్యం జరిగిందా? దానికి సొసైటీనే కారణమా? బాధితుడు ఎటువంటి షరతులు లేకుండా ఫ్లాట్ తీసుకున్నాడా? అనే విషయాలు మెరిట్స్ ఆధారంగా విచారించాల్సి ఉంది. ఇది 2005 నాటి పాత కేసు కాబట్టి, ఢిల్లీలోని 'ద్వారకా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్' ఈ కేసును పునరుద్ధరించి, ఇరుపక్షాలకు సమాన అవకాశం కల్పిస్తూ ఏడాది లోపు తుది తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.






