- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
23 మంది చిన్నారుల మృతికి కారణమైన కోల్డ్‌రిఫ్ సంస్థ మూసివేత
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వల్ల 23 మంది చిన్నారులు మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వల్ల 23 మంది చిన్నారులు మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే యాక్షన్ తీసుకున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చెన్నై కేంద్రంగా ఉన్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన కోల్డ్‌రిఫ్ (Coldrif) దగ్గు సిరప్ తయారీ లైసెన్సును రాష్ట్ర ఆరోగ్య శాఖ పూర్తిగా రద్దు చేసింది. అంతేకాకుండా సంస్థను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం నిర్వహించిన దర్యాప్తులో ఆ సంస్థలో సరైన గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (GMP), గుడ్ లాబొరేటరీ ప్రాక్టీసెస్ (GLP) నిబంధనలు పాటించలేదని, 300కిపైగా ఉల్లంఘనలను గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది. పరిశోధనల్లో కోల్డ్‌రిఫ్ సిరప్‌లో డైఇథిలీన్ గ్లైకాల్ (DEG) అనే ప్రమాదకరమైన రసాయన పదార్థం ఉన్నట్లు తేలింది. ఇది చిన్నారుల మరణాలకు కారణమైందని అధికారులు నిర్ధారించారు. ఇదే నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చెన్నైలోని శ్రీసన్ ఫార్మా, తమిళనాడు FDA ఉన్నతాధికారులతో సంబంధమున్న కనీసం ఏడు ప్రాంతాల్లో దాడులు జరిపింది.
ఈ దాడుల్లో జూలైలో లంచం కేసులో అరెస్టైన తమిళనాడు FDA డైరెక్టర్ ఇన్‌చార్జ్ పి.యు. కార్తికేయన్ నివాసం కూడా ఉంది. ED ప్రకారం, నకిలీ మందు అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలు “నేరపు ఆదాయం” (proceeds of crime)గా పరిగణించబడ్డాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇద్దరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను, ఒక డెప్యూటీ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, రాష్ట్ర ఔషధ నియంత్రణాధికారిని బదిలీ చేసింది. చింద్వారా జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక వైద్యుడిని అరెస్ట్ చేశారు.






