రాష్ట్రవ్యాప్తంగా కాఫీ, టీ విక్రయాలు బంద్‌

by Yella Dhawani Reddy |

కర్ణాటకలో చిరు వ్యాపారులు, టీ-కాఫీ షాపులు, బేకరీలు నిర్వహించే వారు జీఎస్టీ అధికారుల నుంచి వచ్చిన నోటీసులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా కాఫీ, టీ విక్రయాలు బంద్‌
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో చిరు వ్యాపారులు, టీ-కాఫీ షాపులు, బేకరీలు నిర్వహించే వారికి జీఎస్టీ అధికారుల నుంచి వచ్చిన నోటీసులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. డిజిటల్ లావాదేవీల (UPI) ఆధారంగా తమపై పన్ను బాద్యతలు విధించడాన్ని వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వార్షికంగా రూ.40 లక్షలకు పైగా టర్నోవర్ ఉందన్న అనుమానంతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ నోటీసులు జారీ చేయడాన్ని వారు దౌర్జన్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జులై, 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా టీ, కాఫీ, పాల విక్రయాలు నిలిపివేశారు. బేకరీలు, కిరాణా దుకాణాలు, ఇతర చిన్న వ్యాపార సంస్థలు ఈ ఉత్పత్తుల విక్రయాలను బంద్ చేశాయి.

ఇక ఈ నిరసనలో భాగంగా యూపీఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి ‘క్యాష్‌ ఓన్లీ’ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొన్ని బేకరీలు నిరసనగా బ్లాక్ కాఫీ మాత్రమే విక్రయిస్తున్నారు. వ్యాపారులు బ్లాక్ బ్యాడ్జ్‌లు ధరించి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. కర్ణాటక స్టేట్ అసోసియేషన్ ఆఫ్ బేకరీస్, కాండిమెంట్స్ అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ సంఘాలు ఆధ్వర్యంలో జులై 25న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ర్యాలీలో వేలాది మంది చిరు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.

వాణిజ్య పన్నుల శాఖ 2021-22 నుంచి 2024-25 మధ్యకాలంలో యూపీఐ లావాదేవీల ఆధారంగా టర్నోవర్ లెక్కించి జీఎస్టీ నోటీసులు జారీ చేసింది. అయితే వ్యాపారులు తమ విక్రయాలు జీఎస్టీ మినహాయింపుల్లోకి వచ్చే ఉత్పత్తులు అని లేదా 1% కాంపోజిషన్ పథకంలో ఉన్నాయని చెబుతున్నారు. ఉదాహరణకు హావేరి జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి శంకర్‌గౌడ్‌కు రూ.1.63 కోట్ల టర్నోవర్‌ ఆధారంగా రూ.29 లక్షల జీఎస్టీ నోటీసు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారులు యూపీఐ సేవలను విస్మరిస్తూ నగదు లావాదేవీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం సిద్ధారామయ్య జీఎస్టీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 'Know GST' పేరుతో అవగాహన కార్యక్రమం ప్రారంభించడంతో పాటు, రూ.40 లక్షలకు మించిన వ్యాపారులకు ప్రిసంప్టివ్ టాక్స్ స్కీమ్ అమలు చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story