- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాక్రోచ్ జనతా పార్టీకి షాకిచ్చిన ఎక్స్.. ఖాతా నిలిపివేత!
భారతీయ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP)కి గట్టి షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP)కి గట్టి షాక్ తగిలింది. ఈ వ్యంగ్య రాజకీయ సంస్థకు చెందిన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా (@CJP_2029) భారతదేశంలో నిలిచిపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఊహించని రీతిలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోనే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం ఇది దాటేసింది. ఈ నేపథ్యంలోనే దీని ఎక్స్ అకౌంట్ నిలిచిపోవడం గురవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తున్న పాప్-అప్ స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ.. "మేం ఊహించినట్లుగానే కాక్‌రోచ్ జనతా పార్టీ అకౌంట్ భారతదేశంలో నిలిపివేయబడింది" అని ఆయన రాసుకొచ్చారు. ఆ అకౌంట్‌లో.. "లీగల్ డిమాండ్ కారణంగా భారతదేశంలో @CJP_2029 ఖాతాను నిలిపివేసాం" అని ఎక్స్ స్పష్టం చేసింది. ఎక్స్ నిబంధనల ప్రకారం.. అధికారిక సంస్థల నుండి చెల్లుబాటు అయ్యే చట్టపరమైన అభ్యర్థనలు వచ్చినప్పుడు లేదా స్థానిక చట్టాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే నిర్దిష్ట దేశ పరిధిలో ఇలాంటి చర్యలు తీసుకుంటారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీపై జైత్రయాత్ర.. హ్యాకింగ్ యత్నాలు!
ఈ సంస్థ కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 13.5 మిలియన్ల (1.35 కోట్లు) ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉండగా.. ఈ వ్యంగ్య పార్టీ 13.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో దూసుకుపోతోంది. "ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అంటారు కదా" అంటూ గురువారం ఉదయం సిజెపి బీజేపీపై సోషల్ మీడియాలో గట్టి కౌంటర్ కూడా వేసింది. అయితే ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయిన కొద్దిసేపటికే.. తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిజీత్ దిప్కే ఆరోపించారు. లాగిన్ సమస్యలపై ఇన్‌స్టాగ్రామ్ నుండి వచ్చిన ఒక ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను ఆయన ఇందుకు సాక్ష్యంగా చూపించారు.
అసలు ఈ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఎలా పుట్టింది?
ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. దేశంలోని కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు (Cockroaches)", "పరాన్నజీవులు (Parasites)" అంటూ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా, వ్యంగ్యంగా అభిజీత్ దిప్కే ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ని స్థాపించారు. "మా పార్టీలో చేరాలంటే నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తుడై ఉండాలి, ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే గడుపుతూ.. ప్రొఫెషనల్‌గా విమర్శలు (Rant) చేయగలగాలి" అంటూ ఈ సంస్థ తమ అర్హతలను వ్యంగ్యంగా ప్రకటించుకుంది. కాగా.. ఈ సంస్థ స్థాపకుడైన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన ఒక ప్రముఖ పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా విభాగానికి, ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం ఈ వ్యంగ్య పార్టీ సోషల్ మీడియాలో సృష్టిస్తున్న హంగామా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.






