- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాక్రోచ్ జనతా పార్టీ’.. బొద్దింకల వేషధారణలో యమునా నది ప్రక్షాళన.. ఢిల్లీ యువత వినూత్న నిరసన
సామాజిక మాధ్యమాల్లో కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, తమపై వచ్చిన వ్యాఖ్యలను వినూత్న రీతిలో నిరసిస్తూ ఢిల్లీకి చెందిన కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక మాధ్యమాల్లో కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, తమపై వచ్చిన వ్యాఖ్యలను వినూత్న రీతిలో నిరసిస్తూ ఢిల్లీకి చెందిన కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఇటీవల చేసినట్టుగా చెబుతున్న ఓ వ్యాఖ్యకు నిరసనగా యువకులు భారీ ‘బొద్దింకల’ (Cockroaches) వేషధారణలో యమునా నదీ తీరాన్ని శుభ్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ట్రెండింగ్
‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే పేరుతో చేపట్టిన ఈ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. యువకులు బొద్దింకల దుస్తులు ధరించి, నదీ తీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను సంచుల్లో నింపుతూ శుభ్రం చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ వ్యంగ్యం, పర్యావరణ స్పృహ కలగలిపిన ఈ వినూత్న నిరసన పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఇటీవల సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘న్యాయవాద వృత్తిలో ఉన్న కొందరు నిరుద్యోగ యువకులు బొద్దింకల్లా మారి మీడియా, యాక్టివిస్టుల ముసుగులో వ్యవస్థపై దాడి చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని ఉపయోగిస్తూ, ప్రభుత్వ సంస్థలను విమర్శించే వారి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అని ఓ సెటైరికల్ పార్టీ పుట్టుకొచ్చింది.
మరోసారి తెరపైకి యమునా కాలుష్యం..
ఈ నిరసన కేవలం వ్యంగ్యానికే పరిమితం కాకుండా ఢిల్లీలో దీర్ఘకాలంగా ఉన్న యమునా నది కాలుష్య సమస్యను ప్రధానంగా ఎత్తిచూపింది. ది బెటర్ ఇండియా నివేదిక (జలశక్తి మంత్రిత్వ శాఖ జులై 2025 గణాంకాల) ప్రకారం.. ఢిల్లీలో ప్రతిరోజూ సుమారు 3,596 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో దాదాపు 641 మిలియన్ లీటర్ల మురుగు ఎలాంటి శుద్ధి లేకుండానే నేరుగా నదిలో కలుస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు యమునను ఎలా కలుషితం చేస్తున్నాయో ఈ కార్యక్రమం ద్వారా యువత మరోసారి ప్రజల, పాలకుల దృష్టికి తీసుకెళ్లారు.






