బొగ్గు కుంభకోణం కేసు.. I-PAC సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ అరెస్ట్

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో ఐ-ప్యాక్ (I-PAC) సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.

బొగ్గు కుంభకోణం కేసు.. I-PAC సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ ‘ఐ-ప్యాక్’ (I-PAC) సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ (Vinesh Chandel)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో సాగుతున్న మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చందేల్‌ను కోల్‌కతాలో సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఈడీ అదుపులోకి తీసుకుంది. బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును వివిధ మార్గాల ద్వారా మళ్లించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్ కీలక సభ్యుడు అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల వేళ ఈడీ దూకుడు..

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఈ అరెస్ట్ జరగడం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా బొగ్గు, ఇసుక అక్రమ రవాణా కేసుల్లో ఈడీ రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ సేకరించిన కీలక ఆధారాల ప్రాతిపదికనే చందేల్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే, వినేష్ చందేల్ అరెస్టుపై ఐ-ప్యాక్ (I-PAC) సంస్థ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని అధికార పార్టీ నేతలు విమర్శించే అవకాశం ఉంది. చందేల్‌ను బుధవారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ కోసం ఈడీ కస్టడీకి కోరే అవకాశం ఉంది.

Next Story