- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UP: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏళ్లుగా పునరావాసం కోసం చూస్తున్న కుటుంబాలను గుర్తించాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. పూర్వ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి రాష్ట్రంలోని పలుచోట్ల స్థిరపడిన కుటుంబాలకు చట్టబద్ద భూ యాజమాన్య హక్కు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా భూ పత్రాలు ఇవ్వడంతో పాటు నిర్వాసితులుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న, ఏళ్లుగా పునరావాసం కోసం చూస్తున్న కుటుంబాలను గుర్తించాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఇది కేవలం భూ బదిలీకి సంబంధించిన విషయం కాదని, సరిహద్దులు దాటి భారత్‌లో ఆశ్రయం పొంది దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలను గౌరవించే అవకాశం అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కుటుంబాలను సానుభూతి, గౌరవంతో చూసుకోవాలని, ఇది ప్రభుత్వ నైతిక బాధ్యత అని అధికారులను కోరారు.
ముఖ్యంగా విభజన అనంతరం 1960-1975 మధ్య వేలాదిగా హిందూ కుటుంబాలు తూర్పు పాకిస్తాన్ నుంచి బలవంతంగా వలస వచ్చాయి. వారిలో ఎక్కువమంది లఖింపూర్ ఖేరి, రాంపూర్, బిజ్ఞోర్, పిలిభిత్ జిల్లాల్లో స్థిరపడ్డారు. ఆ సమయంలో వారిని తాత్కాలిక ప్రదేశాల్లో ఉంచి, పలు గ్రామాల్లో భూమిని కేటాయించారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత కూడా వారిలో ఎక్కువమందికి వివిధ కారణాలతో చట్టబద్ధంగా భూ యాజమాన్యం దక్కలేదు. సరైన డాక్యుమెంట్లు వారి వద్ద లేవు. వేలాది కుటుంబాలు ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నప్పటికీ, వారి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవని అధికారులు వెల్లడించారు. ఇది చట్టపరమైన, పరిపాలనా సమస్య కాదని, జాతీయ బాధ్యతని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. ప్రభుత్వ గ్రాంట్ చట్టం 2018లో రద్దు అయినందున దానికింద గతంలో ఇచ్చిన చోట ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు ఆదేశించారు. దీన్నొక సమస్య పరిష్కార ప్రక్రియలా కాకుండా సామాజిక న్యాయం, మానవత్వానికి సంబంధించిన విషయంగా చూడాలని పేర్కొన్నారు.






