తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్ష: మిత్రపక్షాల మద్దతు, మరోవైపు చురకలు

by Ramesh Naini |

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్, నేడు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు.

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్ష: మిత్రపక్షాల మద్దతు, మరోవైపు చురకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్.. తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష ప్రారంభం అయింది. ఆయనకు కాంగ్రెస్, ఐయూఎంఎల్ (IUML), వీసీకే (VCK), సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు ప్రకటించడంతో విజయ్ విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

పళనిస్వామికి భారీ షాక్.. అన్నాడీఎంకేలో చీలిక!

అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సి.వీ షణ్ముగం నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. పళనిస్వామి డీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వారు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు, టీవీకేకు మద్దతు ఇచ్చినందుకు గానూ ఏఎంఎంకే (AMMK) ఎమ్మెల్యే ఎస్. కామరాజ్‌ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు.

తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు..

వీసీకే అధినేత తిరుమావళవన్ అసెంబ్లీ సాక్షిగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. విజయ్‌ను అధికారానికి దూరం చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు చేతులు కలిపి, తనను ముఖ్యమంత్రిని చేస్తామని ఆశ చూపాయని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించి విజయ్ వైపే నిలబడ్డానని ఆయన స్పష్టం చేశారు.

మిత్రపక్షాల చురకలు.. సూచనలు

మిత్రపక్షాలు విజయ్‌కు మద్దతు ఇస్తూనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. బీజేపీ ఆటలు సాగనివ్వకుండా ఉండేందుకే తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నామని ఐయూఎంఎల్, వామపక్షాలు ప్రకటించాయి.

జ్యోతిష్యం వద్దు.. విజ్ఞానం ముద్దు

విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఓఎస్‌డీగా నియమించుకోవడంపై వీసీకే నేత వన్నియరసు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జ్యోతిష్యానికి కాకుండా శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత అల్పాహార పథకాన్ని కొనసాగించాలని, శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పించాలని మిత్రపక్షాలు కోరాయి. డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువత మీకు ఓటు వేసి గెలిపించారు. కానీ మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఓఎస్డీగా నియమించడానికి కారణం ఏంటి..? ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని ఆమె చురకలు అంటించారు.

Next Story