రైతుగా మారిన సీఎం.. నాగలి పట్టి పొలం దున్నిన ఫొటోలు వైరల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-06 02:37:23  IST  )

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుమాయూన్ పర్యటనలో భాగంగా శనివారం ఖటీమా నియోజకవర్గంలోని నగర తరాయ్ గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

రైతుగా మారిన సీఎం.. నాగలి పట్టి పొలం దున్నిన ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Uttarakhand Chief Minister Pushkar Singh Dhami) ప్రస్తుతం కుమాయూన్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా శనివారం ఖటీమా నియోజకవర్గంలోని (Khatima Constituency) నగర తరాయ్ గ్రామాన్ని అకస్మాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా స్వయంగా పొలాల్లోకి వెళ్లి నాగలి పట్టి దున్నారు. అనంతరం అక్కడి రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం ధామి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. 'ఖటీమా నగర తరాయ్‌లో పొలాల్లో ధాన్యం నాటి, రైతుల శ్రమ, త్యాగం, సమర్పణను స్వయంగా అనుభవించాను. ఈ సందర్భం నాకు పాత రోజులను గుర్తు చేసింది. అన్నదాతలు కేవలం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, వారు మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షకులు కూడా' అని ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా సీఎం ధామి ఉత్తరాఖండ్ సంప్రదాయ కళారూపమైన 'హుడ్కియా బౌల్' ప్రదర్శన ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు. ఈ ప్రాచీన గీతకళ రూపం ద్వారా భూమి దేవత భూమియా, వర్షదేవుడు ఇంద్రుడు, మేఘ దేవత మేఘకు వందనలు చేశారు. ఈ కార్యక్రమం గ్రామీణ జీవన విధానానికి ఇచ్చిన గౌరవాన్ని, ప్రకృతితో మానవ సంబంధాన్ని ప్రతిబింబించింది. పల్లెటూర్ల రైతుల కష్టాన్ని పక్క నుంచి చూశానని సీఎం చెప్పారు. వ్యవసాయం, సాంస్కృతిక వారసత్వం పట్ల సీఎం ధామి చూపిన ఆసక్తి ప్రజలలో మంచి ఆదరణ తెచ్చుకుంటోంది.

Next Story