- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: మోడీ సర్కార్‌కు స్టాలిన్ హెచ్చరిక
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేకపోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కే. స్టాలిన్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేకపోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కే. స్టాలిన్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఇది కేవలం ఒక బిల్లు ఓటమి కాదని, దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవానికి మరియు సమాఖ్య స్ఫూర్తికి దక్కిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పీఠంపై తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల పోరాటం గెలిచింది. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించేలా ఉన్న డీలిమిటేషన్ కుట్రను మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. నేడు పార్లమెంట్‌లో ఆ కుట్ర పటాపంచలైంది అని స్టాలిన్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాష్ట్రాల హక్కులను కాలరాయాలని చూసిన కేంద్ర ప్రభుత్వానికి ఇది గట్టి చెంపపెట్టు అని ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో విపక్షాల ఐక్యత కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. లోక్‌సభలో ఇవాళ్టి విజయం కేవలం ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీని ఓడించాం, 23న బీజేపీ బానిసలను ఓడిస్తాం అని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య విజయం...
లోక్‌సభలో 2/3 మెజార్టీ సాధించలేక బిల్లు వీగిపోవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ ధోరణులకు తావులేదని నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమైన మహిళా రిజర్వేషన్లు కావాలంటే, ఏ నిబంధనలు లేకుండా, తక్షణమే అమలు చేసేలా కొత్త బిల్లు తీసుకురావాలని ఆయన కేంద్రానికి సూచించారు. డీలిమిటేషన్ జరిగితే తమిళనాడు తన ప్రస్తుత లోక్‌సభ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని స్టాలిన్ గతంలోనే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆగిపోవడాన్ని ఆయన తన సిద్ధాంత పరమైన విజయంగా భావిస్తున్నారు. ఈ పరిణామం తమిళనాడులో డీఎంకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






