- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్ ఇదే !
కోయంబత్తూరులో పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురికావడంపై సీఎం విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూర్ లో 10 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్, దారుణ హత్య ఉదంతం రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీసింది. గురువారం (మే 21) సాయంత్రం ఇంటి దగ్గర్లో ఉన్న షాపుకి కిరాణా సామాన్లు కొనేందుకు వెళ్లిన బాలిక మిస్సైంది. పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయగా.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు శుక్రవారం ఉదయం కణ్ణంపాలయం చెరువు సమీపంలో గాయాలతో ఉన్న బాలిక మృతదేహం కనిపించింది. ఈ కేసులో ఇప్పటికే అనుమానితులుగా భావిస్తోన్న కార్తీక్, మోహన్ రాజ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సూలూర్ పీఎస్ ముందు.. బాలిక పేరెంట్స్, బంధువులు, విద్యార్థులు, స్థానికులు భారీఎత్తున రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేశారు. సీఎం నుంచి దీనిపై స్పష్టమైన హామీ వచ్చేంతవరకూ.. బాలిక డెడ్ బాడీని తీసుకెళ్లబోమని పేరెంట్స్ స్పష్టం చేశారు.
తమిళనాడులో జరిగిన ఈ ఘోర కలిపై సీఎం జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి అమానవీయ, క్షమించరాని నేరాలను సహించబోమని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, సమగ్ర విచారణ చేసి.. వెంటనే చార్జ్ షీట్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించామన్నారు. మహిళలు, పిల్లలపై ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన శిక్షపడేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎక్స్ లో చేసిన పోస్టులో విజయ్ పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో తమిళనాడు డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్ కోయంబత్తూర్ కు చేరుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన 12 రోజుల్లోనే ఇలాంటి దారుణం జరిగిందని, నేరాల గ్రాఫ్ పెరిగిపోయేలా ఉందని వాపోయాయి.
ప్రతిపక్ష నేత, డీఎంకే (DMK) నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే లైంగిక దాడులు, గంజాయి స్మగ్లింగ్, రౌడీయిజం వంటి 30కి పైగా ప్రధాన నేరాలు జరిగాయని, ఇది రాష్ట్రంలోని శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళల భద్రత హామీతో అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ పాలనలో 10 ఏళ్ల బాలికకు రక్షణ లేకుండా పోయిందని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై ప్రశ్నించారు. అయితే, ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ నేత నారాయణన్ తిరుపతి తిప్పికొట్టారు. గతంలోని ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తమిళనాడులో శాంతిభద్రతలను పూర్తిగా దిగజార్చిందని, ఆ ప్రభావమే నేటికీ ఇలాంటి దారుణాలు కొనసాగడానికి కారణమని ఆయన మండిపడ్డారు. వివాదం ముదురుతుండటంతో టీవీకే మంత్రి ఎం.ఎస్. సంపత్, స్థానిక ఎమ్మెల్యే ఎన్.ఎం. సుకుమార్ ఆసుపత్రిలో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు.






