హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు.. యూఏఈ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబు దాడి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 02:08:41  IST  )

హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వేళ యూఏఈలోని ఫుజైరా ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబు దాడులకు దిగింది.

హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు.. యూఏఈ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ బాంబు దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. యూఏఈ (UAE)కి చెందిన ఫుజైరా (Fujairah) చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ (Iran) బాంబు దాడులకు దిగింది. ఈ భీకర దాడిలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. గల్ఫ్‌పై ఆధిపత్యం కోసం ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన ఫుజైరా పోర్ట్ సమీపంలోని రిఫైనరీని ఇరాన్ లక్ష్యం చేసుకుంది. బాంబు దాడుల ధాటికి రిఫైనరీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు భారతీయ కార్మికులు మంటల చిక్కుకుని గాయపడ్డారు. ప్రస్తుతం వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత..

ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసివేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. తాజా దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా (America) సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. యూఏఈ కూడా తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడే అవకాశం ఉంది.

Next Story