Micro Burst: క్లౌడ్ బరస్ట్ కు మించిన విధ్వంసం.. ఏమిటీ ‘మైక్రో బరస్ట్’?

by Prasad Jukanti |   (  Updated:2025-08-13 15:39:07  IST  )

ఆకాశం నుంచి నది జారిపడిపోయిందా అనేలా కనిపించే మైక్రో బరస్ట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

Micro Burst: క్లౌడ్ బరస్ట్ కు మించిన విధ్వంసం.. ఏమిటీ ‘మైక్రో బరస్ట్’?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నాయి. ఆకస్మిక వరదలు అడ్వాన్స్ టెక్నాలజీకి చాలెంజ్ లు విసురుతున్నాయి. అంతా కామ్ గా ఉందనుకుంటున్న చోట కళ్ళు మూసి తెరిచేలోపు ఆకాశానికి చిల్లుపడుతోంది. ఉన్నట్టుండి వరదలు విలయతాండవం చేస్తున్నాయి. ఇటీవల భారతదేశంలోనూ ఇలాంటి ఆకస్మిక వరదలు ప్రజలను భయపెడుతున్నాయి. అయితే ఈ జలప్రళయాలకు క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కారణం అనే చర్చ జరుగుతోంది. నిమిషాల్లోనే పెను విధ్వంసం సృష్టించగల క్లౌడ్ బరస్ట్ గురించి వింటే వెన్నులో వణుకుపుట్టిస్తోంది. కానీ క్లౌడ్ బరస్ట్ కు మించి విధ్వంసం చేయగల మైక్రో బరస్ట్ ఇప్పుడు అందరిని టెన్షన్ పెడుతోంది. ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెడుతున్న ఈ మైక్రోబరస్ట్ (Micro Burst) అంటే ఏంటి? ఇది ఎలా ఏర్పడుతుంది? క్లౌడ్ బరస్ట్ కంటే నిజంగానే విధ్వంసకారా? అనేది చూద్దాం.

ఏమిటీ మైక్రో బరస్ట్..?

సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్ని మేఘ విస్పోటం లేదా క్లౌడ్ బరస్ట్ అని అంటారు. ఈ పరిస్థితిలో 20 నుంచి 30 చ.కి.మీ పరిధిలో గంటకు 10 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది. కానీ మైక్రో బరస్ట్ లో అలా కాదు. ఒక శక్తివంతమైన ఉరుములతో కూడిన మేఘంలోని చల్లని గాలి ఒక బలమైన నిలువు ప్రవాహంలో భూమి వైపుకు తోసుకు వస్తుంది. ఈ గాలి తనతో పాటు మేఘంలో ఉన్న నీటిని కూడా అత్యంత వేగంగా కిందకు లాగేస్తుంది. దీంతో సాధారణ వర్షం చినుకులుగా కాకుండా భారీ నీటి స్తంభంలా ఆకాశం నుంచి ఓ నది భూమిపైకి జారిపడిపోయిందా అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. మేఘాలను తోసుకుంటూ వచ్చే గాలి ప్రవాహం భూమిని తాకినప్పుడు అది నక్షత్ర ఆకారంలో అన్ని దిశలలో వ్యాపిస్తుంది. దీన్ని మైక్రో బరస్ట్ అంటారు. ఈ ప్రక్రియలో గంటకు 100-150 కి.మీ వేగంతో సుడిగాలులు ఏర్పడుతాయి. ఈ కాలులు ఇవి తుఫాన్ లేదా హరికేన్ స్థాయితో సమానంగా ఉంటాయి. సాధారణంగా 5-15 నిమిషాల పాటు మాత్రమే ఉండి చెట్లు, విద్యుత్ స్తంభాలు, భవనాలు ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తూ విధ్వసం సృష్టిస్తాయి. విమానాలు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో మైక్రోబరస్ట్‌లో పడితే విమానాలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

రెండు రకాలుగా మైక్రో బరస్ట్:

ఈ మైక్రో బరస్ట్ లు డ్రై, వెట్ మైక్రో బరస్ట్ లు అని రెండు రకాలుగా ఉంటాయి. డ్రై మైక్రోబరస్ట్ లో వర్షం భూమికి రాకముందే ఆవిరైపోవడం వల్ల ఏర్పడతాయి. వెట్ మైక్రోబరస్ట్ భారీ వర్షంతో కూడి ఏర్పడతాయి. మైక్రో బరస్ట్ టోర్నాడో చూపరులకు ఒకే రకంగా కనిపించినా టొర్నాడో లో గాలి సుడిగుండంలా తిరుగుతూ అది ఏర్పడిన చోటనే నష్టాన్ని కలిగిస్తాయి. కానీ మైక్రోబరస్ట్ లో గాలి నేరుగా భూమిని చేరి అన్ని దిశలలో వ్యాపించడంతో దాని నష్టం కూడా విస్తరిస్తుంది. మైక్రోబరస్ట్‌లను గుర్తించడానికి రాడార్‌లు మరియు వాతావరణ పరిశీలన సాధనాలు ఉపయోగించబడతాయి, అయితే అవి చాలా వేగంగా ఏర్పడతాయి కాబట్టి, వాటిని ముందుగా హెచ్చరించడం కష్టం.

మైక్రో బరస్ట్ విధ్వంసాలు:

మైక్రోబరస్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంభవిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. 2024 లో టెక్సాస్ లోని ఆస్టిన్ లో అరుదైన మైక్రో బరస్ట్ స్థానికంగా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. 2020 లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో సంభవించిన మైక్రోబరస్ట్ కు సంబంధించిన వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఆకాశం నుంచి ఒక్క సారిగా నీరు సునామిలా భూమిమీద పడినట్లుగా అనిపించే ఈ దృశ్యం చూసేవారిని అబ్బురపరిచేలా ఉంటుంది. ఇక 1983 లో యూఎస్ లోని మేరీ ల్యాండ్ లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బెస్ లో అత్యంత శక్తివంతమైన మైక్రోబరస్ట్ నమోదు అయింది. ఇది ఏర్పడినప్పుడు గాలి వేగం గంటకు 240 కి.మీ ఏర్పడ్డాయి. 1984 లో యూఎస్ఏ సౌత్ డకోటా రొవెనా లోని టెడ్ ఫుజిటా లో ఏర్పడిన మైక్రోబరస్ట్ అత్యంత తీవ్రమైనదిగా నమోదు చేశారు. ఇక్కడ గంటకు 257 కి.మీ వేగంతో గాలివీచినట్లు నమోదైంది. ఇటీవల మన దేశ వాతావరణంలోను ఏర్పడుతున్న విపరీతమైన మార్పులకు ఆకస్మిక వరదలకు ఈ మైక్రో బరస్ట్ లు కారణం అయి ఉంటుందా అనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. మైక్రోబరస్ట్‌లను గుర్తించడానికి రాడార్‌లు, ఇతర సాధనాలు ఉపయోగపడినా ఇవి చాలా వేగంగా ఏర్పడటం వల్ల ముందుగా హెచ్చరించడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు.

Next Story