సీజేఐ సూర్యకాంత్ పొదుపు మంత్రం.. అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలకు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-18 10:24:29  IST  )

పొదుపు చర్యల్లో భాగంగా దేశంలోని అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టు విధానాన్ని పాటించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.

సీజేఐ సూర్యకాంత్ పొదుపు మంత్రం.. అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) ఇవాళ కీలక సూచనలు చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా.. కేసుల విచారణలో ప్రస్తుతం సుప్రీంకోర్టు (Supreme Court) అనుసరిస్తున్న విధానాలనే హైకోర్టులు కూడా పాటించాలని ఆయన కోరారు. ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుత వేసవి సెలవులు ముగిసేంత వరకు, అవకాశం ఉన్నంత మేరకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ చేపట్టాలని ఇదే పొదుపు విధానాన్ని అవలంబించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని హైకోర్టులకు ఇప్పటికే అధికారికంగా విజ్ఞప్తి చేసినట్లు సీజేఐ స్పష్టం చేశారు.

వారానికి రెండు రోజులు వీడియో కాన్ఫరెన్స్..

పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి వారం సోమవారం, శుక్రవారం రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్ (Virtual Hearing) ద్వారానే విచారణలు జరపాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. కాగా, ఈ విధానంలో భాగంగానే సోమవారం సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో విచారణలు పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సాగాయి. సుప్రీంకోర్టులో డిజిటల్ పద్ధతిలో జరిగిన ఈ విచారణలపై ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కేసుల విచారణలు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా అత్యంత సవ్యంగా, సాఫీగా సాగాయని ఆయన సీజేఐ దృష్టికి తీసుకువచ్చారు. వేసవి కాలంలో ఈ విధానం న్యాయవ్యవస్థకు, న్యాయవాదులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రోహత్గి పేర్కొన్నారు.

Next Story