‘బొద్దింకల వంటి నిరుద్యోగుల వ్యాఖ్యలు’ : క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు సీజేఐ

by Naga Rani Yarlagadda |

నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది.

‘బొద్దింకల వంటి నిరుద్యోగుల వ్యాఖ్యలు’ : క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు సీజేఐ
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. నిరుద్యోగులను అంత తేలికగా తీసిపారేస్తున్నారని కొందరు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై సీజేఐ తాజాగా వివరణ ఇచ్చారు. ఒక పనికిరాని (ఫ్రివోలస్) పిటిషన్ విచారణ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక విభాగం తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించినవి కావని, నకిలీ, బోగస్ డిగ్రీలతో ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్న వారిని ఉద్దేశించి చేసినవని సీజేఐ స్పష్టం చేశారు.

నకిలీ డిగ్రీలతో బార్ అసోసియేషన్లోకి వచ్చినవారిని మాత్రమే ఉద్దేశించి ఆ విమర్శలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఇలాంటి నకిలీలు మీడియా, సోషల్ మీడియా, ఇతర ఉన్నతమైన వృత్తోల్లో కూడా ఉన్నారని, అందుకే వారిని సమాజాన్ని పీడించే పారాసైట్స్ (పరాన్నజీవులు)గా పేర్కొన్నానని తెలిపారు. భారతీయ యువతను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న నివేదికలు ముమ్మాటికీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. అభివృద్ధి చెందుతున్న మనదేశానికి.. యువతే మూల స్తంభాలని, వారిపై తనకెంతో నమ్మకం గౌరవం ఉన్నాయని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..?

సీనియర్ అడ్వకేట్ హోదా కోరుతూ ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆ సమయంలో పిటిషనర్ ప్రవర్తన, అతని సోషల్ మీడియా కార్యకలాపాలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీనియర్ హోదా అనేది కోర్టులు ఇచ్చే గౌరవమని, దాని కోసం ఇలా పాకులాడకూడదని హితవు పలికింది. "వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఇప్పటికే ఉన్నారు, ఇప్పుడు నువ్వు కూడా వారితో చేతులు కలపాలనుకుంటున్నావా?" అని కోర్టు ప్రశ్నించింది.

ఈ క్రమంలోనే, ఎక్కడా ఉపాధి దొరకక, వృత్తిలో రాణించలేక కొందరు యువకులు నకిలీ సర్టిఫికెట్లతో మీడియా, సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థలపై దాడులు చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. న్యాయవాద వృత్తిలో నకిలీ అర్హతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బెంచ్.. ఓట్ల రాజకీయం కారణంగా 'బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' కూడా వీరిపై చర్యలు తీసుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా.. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు పిటిషనర్ ధర్మాసనానికి క్షమాపణలు చెప్పి, తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దానికి న్యాయస్థానం అనుమతించింది.

Next Story