CJI Gavai: దేశ అభివృద్ధికి రాజ్యాంగమే కారణం.. సీజేఐ బీఆర్ గవాయ్

by B.Srinivas |

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి రాజ్యాంగమే కారణమని బీఆర్ గవాయ్ నొక్కి చెప్పారు.

CJI Gavai: దేశ అభివృద్ధికి రాజ్యాంగమే కారణం.. సీజేఐ బీఆర్ గవాయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి రాజ్యాంగమే కారణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Gavai) నొక్కి చెప్పారు. దేశంలో సంక్షోభం ఏర్పడినప్పుడల్లా అది ప్రజలందరినీ ఐక్యం చేసిందని, కాబట్టి అభివృద్ధి క్రెడిట్ రాజ్యాంగానికే దక్కాలని తెలిపారు. అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్ చాంబర్స్ అండ్ మల్టీ-లెవల్ పార్కింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవాయ్ ప్రసంగించారు. దేశంలోని చివరి పౌరుడికీ న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రాథమిక విధి అని అన్నారు. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థ అయినా ప్రతి ఒక్కరూ ఆ పౌరుడిని చేరుకోవాలన్నారు. దేశంలో సంక్షోభం వచ్చినప్పుడల్లా మనం ఐక్యంగా ఉండేలా చేయడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందన్నారు.

‘రాజ్యాంగ తుది ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు సమర్పించినప్పుడు కొంతమంది రాజ్యాంగం సమాఖ్య అని చెప్పేవారు. మరికొందరు ఏకీకృతమని అభివర్ణించారు. అంబేడ్కర్ రాజ్యాంగం పూర్తిగా సమాఖ్య లేదా పూర్తిగా ఏకీకృతం కాదని బదులిచ్చారు. కానీ శాంతి, యుద్ధ సమయాల్లో భారతదేశాన్ని ఐక్యంగా, బలంగా ఉంచే రాజ్యాంగాన్ని అందజేశారు’ అని వ్యాఖ్యానించారు. బార్ అండ్ బెంచ్ (Bar and bench) కలిసి పనిచేయకపోతే న్యాయ రథం ముందుకు సాగబోదని స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టు యావత్ దేశానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.

Next Story