- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశానికి ఒక్క రాజ్యాంగం చాలు.. అంబేద్కర్ ఆశయాలతోనే ఆర్టికల్ 370 రద్దు: సీజేఐ గవాయ్
దేశానికి ఒక్క రాజ్యాంగం చాలని, అంబేద్కర్ ఆశయాలతోనే ఆర్టికల్ 370 రద్దు చేశామని సీజేఐ గవాయ్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉండాలని బీఆర్ అంబేద్కర్ భావించారని, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ఏ రాష్ట్రానికైనా మరో రాజ్యాంగం ఉండాలనే ఆలోచనకు అంబేద్కర్ ఎప్పుడూ మద్దతివ్వలేదని గవాయ్ స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ‘రాజ్యాంగ పీఠిక పార్క్’ (కాన్‌స్టిట్యూషన్ ప్రీయంబిల్ పార్క్)ను గవాయ్ ప్రరాంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్ర నిర్ణయానికి మద్దతిచ్చే సమయంలో అంబేద్కర్ ఆశించిన ‘ఒక దేశం-ఒకే రాజ్యాంగం’ భావన నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు జడ్జీల రాజ్యంగ ధర్మాసనంలో గవాయ్ కూడా ఉన్నారు.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. ‘ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆ విషయం మా ముందుకు వచ్చింది. విచారణ సమయంలో దేశం మొత్తానికి ఒక రాజ్యాంగం చాలన్న బాబాసాహెబ్ మాటలు నాకు గుర్తొచ్చాయి. దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఒక్క రాజ్యాంగమే ఉండాలి’ అని స్పష్టంచేశారు. ‘ఈ భావాల వల్ల అంబేద్కర్‌ను కూడా చాలామంది విమర్శించారని, ఈ రాజ్యాంగం ఫెడరలిజానికి మద్దతిస్తుందని, యుద్ధం జరిగే సమయాల్లో దేశమంతా ఒకే తాటిపై ఉండకపోవచ్చని చాలా మంది అన్నారు. కానీ ఈ రాజ్యాంగం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తూనే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని బాబాసాహెబ్ చెప్పారు’ అని గవాయ్ గుర్తుచేసుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో సమస్యలను ఎత్తిచూపిన ఆయన.. ఎలాంటి సమస్యలు ఎదురైనా భారత్ మాత్రం ఐకమత్యంతో కలిసి ఉందన్నారు.






