- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత రాజ్యాంగం నిశ్శబ్ద విప్లవం.. ఆక్స్‌ఫర్డ్‌లో సీజేఐ గవాయ్!
భారత రాజ్యాంగం నిశ్శబ్ద విప్లవం అని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనియన్ స్పీచ్‌లో ఆయన మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని కులవివక్ష, పేదరికం, అంటరానితనం వంటి కఠిన నిజాలను కూడా భారత రాజ్యాంగం గుర్తిస్తుందని, అంతేకానీ ఈ సమస్యలన్నీ మర్చిపోయి దేశంలో అందరూ సమానమే అని వట్టిమాటలతో సరిపెట్టదని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనియన్ స్పీచ్‌లో ‘ఫ్రం రిప్రజంటేషన్ టు రియలైజేషన్: ఎంబాడీయింగ్ ది కాన్‌స్టిట్యూషన్స్ ప్రామిస్’ (ప్రాతినిధ్యం నుంచి వాస్తవికత వైపు: రాజ్యంగ హామీని నెరవేర్చడం) అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ‘తీవ్రమైన అసమానతలు అనుభవించిన దేశంలో.. అసలు అలాంటి సమస్యలే లేవని, అందరూ సమానమే అన్నట్లు భారత రాజ్యాంగం ప్రవర్తించదు. బాధితుల గౌరవాన్ని కాపాడేందుకు అధికారాన్ని వారికి కూడా పంచి చరిత్రను తిరగరాసేందుకు.. ఈ సమస్యల్లో ధైర్యంగా జోక్యం చేసుకుంటుంది’ అని చెప్పారు.
భారత్‌లో రెండో దళిత సీజేఐ అయిన గవాయ్.. మున్సిపల్ స్కూల్ నుంచి సీజేఐ స్థాయికి తను రావడంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కీలకపాత్ర పోషించిందన్నారు. ‘దశాబ్దాల క్రితం లక్షలాది మంది భారత ప్రజలను అంటరానివారిగా చూసేవారు. వాళ్లు స్వచ్ఛమైన వాళ్లు కాదని, వాళ్లు ఎక్కడా పనికిరారని, మాట్లాడకూడదని.. ఎన్నో ఆంక్షలుండేవి. అప్పుట్లో ఇలాంటి అసమానతలు అనుభవించిన వారిలో ఒకడు.. దేశంలోని న్యాయ విభాగంలో అత్యున్నత స్థానంలో నిలబడి మీ ముందు మాట్లాడుతున్నాడు. ఇదే భారత రాజ్యాంగం చేసిన పని. భారతీయులంతా ఇక్కడి వారేనని, అందరూ స్వరం వినిపించాలని.. సమాజంలోని ప్రతి రంగంలో, అధికారంలో అందరికీ హక్కుందని చెప్పింది’ అని ఆయన పేర్కొన్నారు.
‘నేను ఆక్స్‌ఫర్డ్ యూనియన్ నుంచి చెప్తున్నా.. భారత్‌లోని బలహీన ప్రజలకు రాజ్యాంగం ఒక అధికారపరమైన చట్టమో, రాజకీయ విధానాలను వివరించే చట్రమో కాదు. అది ఒక అనుభూతి, ఒక లైఫ్‌లైన్ (జీవనరేఖ) .. ఇంకుతో రాసిన ఒక నిశ్శబ్ద విప్లవం’ అని సీజేఐ గవాయ్ అన్నారు. శతాబ్దాల అణచివేతను అనుభవించిన తర్వాత కూడా బాధిత ప్రజలు ఎవరి దయాదాక్షిణ్యాలు కోరుకోలేదని చెప్పారు. ‘నవభారతంలో వాళ్లు ఆశించింది గుర్తింపు, గౌరవం, రక్షణ మాత్రమే. వాళ్లు దానధర్మాలు అడగలేదు.. రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యంలో వాళ్ల హక్కు మాత్రమే కోరుకున్నారు. రాజ్యాంగంలో గుర్తింపు దక్కిందంటే దేశం గుర్తించినట్లే. ఈ పుస్తకంలో చోటు దక్కితే దేశ భవిష్యత్తులో భాగమైనట్లే’ అని ఆయన తెలిపారు.
‘దేశంలోని అత్యంత అణగారిన సామాజిక వర్గాలు రాజ్యాంగంలో అంశాలే కాదు.. దాని నిర్మాణంలో భాగస్వాములు కూడా. చాలామంది పట్టించుకోని అద్భుతమైన విషయం ఇది. రాజ్యాంగాన్ని మరింత విస్తృతంగా సృష్టించేందుకు దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలు, దివ్యాంగులు, ఒకప్పుడు అన్యాయంగా ‘నేరాలు చేసే తెగలు’గా గుర్తించిన వాళ్లు.. అందరికీ రాజ్యాంగ సభలో చోటుకల్పించారు. అంతా కలిసి న్యాయం, సమానత్వం అందరికీ దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు’ అని సీజేఐ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.






