రివాల్వర్‌తో కాల్చుకుని.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఆత్మహత్య!

by Ramesh Naini |

ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ సీ.జే. రాయ్ (57) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు.

రివాల్వర్‌తో కాల్చుకుని.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఆత్మహత్య!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం, కాన్ఫిడెంట్ గ్రూప్ (Confident Group) వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ సీ.జే. రాయ్ (57) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ సమీపంలో ఉన్న తన కార్యాలయంలో ఆయన తన వ్యక్తిగత రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకోవడం వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఒత్తిడే కారణమా?

లభించిన సమాచారం ప్రకారం.. గత కొంతకాలంగా కాన్ఫిడెంట్ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ (IT) నిఘా ఉంచింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఐటీ అధికారులు రాయ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది. అధికారులు పత్రాలను పరిశీలిస్తున్న సమయంలోనే, తన ఛాంబర్‌లో ఉన్న రాయ్ అకస్మాత్తుగా తుపాకీతో ఛాతిపై కాల్చుకున్నారు. తీవ్ర రక్తస్రావమైన ఆయన్ను ఐటీ అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఐటీ దాడుల నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు, సూసైడ్ నోట్ వంటి వివరాలపై పోలీసులు రాయ్ కుటుంబ సభ్యులను, సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన ఐటీ అధికారులు సోదాలను నిలిపివేసి వెనుదిరిగారు. రెండు ఇన్నోవా వాహనాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో ధ్రువతార

2005లో కాన్ఫిడెంట్ గ్రూప్‌ను స్థాపించిన సీ.జే. రాయ్, అతి తక్కువ కాలంలోనే కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వందలాది ప్రాజెక్టులను పూర్తి చేసి అగ్రగామిగా నిలిచారు. రియల్ ఎస్టేట్‌తో పాటు విద్యా, విమానయానం, ఆతిథ్యం, వినోద రంగాల్లోనూ తన ముద్ర వేశారు. యూఏఈలో కూడా ఆయనకు భారీ వ్యాపార సామ్రాజ్యం ఉంది. అటువంటి ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త ఇలా తనువు చాలించడం పట్ల రియల్ ఎస్టేట్ రంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

Next Story