చైనా అంతరిక్ష ప్రయోగం ఫెయిల్.. నింగిలోనే ముక్కలైన ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్

by Kema Shiva Kumar |

చైనా వాణిజ్య అంతరిక్ష రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన అత్యంత శక్తిమంతమైన తియాన్‌లాంగ్-3 (Tianlong-3) రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపంతో విఫలమైంది.

చైనా అంతరిక్ష ప్రయోగం ఫెయిల్.. నింగిలోనే ముక్కలైన ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్ష పరిశోధనల్లో చైనా (China)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్ పయనీర్’ (Space Pioneer) ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన తియాన్‌లాంగ్-3 రాకెట్ ప్రయోగం విఫలమైంది. సాంకేతిక లోపం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే రాకెట్ కుప్పకూలిపోయింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న డాంగ్‌ఫెంగ్ కమర్షియల్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వాణిజ్యపరంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఈ శక్తిమంతమైన రాకెట్‌ను రూపొందించారు.

ప్రమాదం జరిగిందిలా..

రాకెట్ ఇంజిన్‌ను భూమిపైనే ఉంచి పరీక్షించే క్రమంలో (Ground Test) ఊహించని సాంకేతిక లోపం తలెత్తింది. రాకెట్ స్ట్రక్చర్, లాంచ్ ప్యాడ్ మధ్య ఉన్న అనుసంధానం విఫలం కావడంతో, రాకెట్ ఒక్కసారిగా నింగిలోకి దూసుకెళ్లింది. కొద్దిసేపు ప్రయాణించిన అనంతరం నియంత్రణ కోల్పోయి, ప్రయోగ కేంద్రానికి సమీపంలోని కొండల మధ్య కుప్పకూలిపోయింది. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి. అయితే, నిర్మానుష్య ప్రాంతంలో రాకెట్ పడటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, తియాన్‌లాంగ్-3 రాకెట్‌ను అమెరికాకు చెందిన ఎలాన్ మాస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ (SpaceX) నిర్మించిన ఫాల్కన్-9 రాకెట్‌కు ధీటుగా చైనా అభివృద్ధి చేసింది. ఇది ద్రవ ఇంధనంతో పనిచేసే మల్టీ-స్టేజ్ రాకెట్. దీనిని తిరిగి వినియోగించుకునేలా (Reusable) తయారు చేయడం దీని ప్రత్యేకత. కానీ, ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో పాగా వేయాలని చూస్తున్న చైనాకు ఈ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story