PM Modi: దలైలామాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పడంపై చైనా అభ్యంతరం

by S Gopi |   (  Updated:2025-07-07 14:17:41  IST  )

భారత్‌కు తమ నిరసనను అధికారికంగా తెలియజేసినట్లు ప్రకటించింది.

PM Modi: దలైలామాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పడంపై చైనా అభ్యంతరం
X

దిశ, నేషనల్ బ్యూరో: టిబెట్ బౌద్ధ గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలపడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం భారత్‌కు తమ నిరసనను అధికారికంగా తెలియజేసినట్లు ప్రకటించింది. టిబెట్‌కు సంబంధించిన అంశాల్లోని సున్నితత్వాన్ని భారత్ పూర్తిగా అర్థం చేసుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అన్నారు. బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'దలైలామా మతం ముసుగులో చాలా కాలంగా చైనా నుంచి టిబెట్‌ను వేరుచేయడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ ప్రవాసి, వేర్పాటువాది. ఆయన స్వభావాన్ని భారత్ గుర్తించాలి' అని అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి మోడీ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, భారత ప్రభుత్వాధికారులు దలైలామా పుట్టినరోజు వేడుకలకు హాజరుకావడంపై చైనా నిరసన తెలిపినట్టు సమాచారం. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని భారత్‌కు సూచించారు. కాగా, ఆదివారం దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. దలైలామా ప్రేమ, కరుణ, సహనానికి ప్రతీక, ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.

అలాగే, హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ మధ్యే దలైలామా గురించి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చైనా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దలైలామా వారసుడు ఎవరనే విషయం నిర్ణయించాల్సిన అధికారం తమ ప్రభుత్వానికే ఉందని చైనా వాదిస్తుండగా, అది బౌద్ధ సంప్రదాయాల ప్రకారం జరుగుతుందని భారత్, దలైలామా వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story