35 మంది ప్రాణాలను బలిగొన్న డ్రైవర్‌కు మరణశిక్ష

by Ajay Maddhiboyina |

2024 నవంబర్ 11న ఝుహాయ్ నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయట అతను నిర్లక్ష్యంగా కారు నడిపించాడు.

35 మంది ప్రాణాలను బలిగొన్న డ్రైవర్‌కు మరణశిక్ష
X

- కోర్టు అనుమతితో అమలు చేసిన చైనా

- వెల్లడించిన సీసీటీవీ

దిశ, నేషనల్ బ్యూరో:

35 మంది మరణానికి కారకుడైన ఒక వృద్ధ కారు డ్రైవర్‌కు చైనా మరణ శిక్ష అమలు చేసింది. నిరుడు నవంబర్‌లో రద్దీగా ఉన్న ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోకి తన కారును అత్యంత వేగంగా నడిపి 35 మంది ప్రాణాలను బలి తీసుకోవడామే కాకుండా మరో 43 మంది తీవ్రంగా గాయపడటానికి కారణమైన ఫాన్ వికియూ(62) అనే వ్యక్తికి న్యాయస్థానం అనుమతితో మరణ శిక్ష అమలు చేసినట్లు చైనా అధికారిక మీడియా సీసీ టీవీ సోమవారం వెల్లడించింది. 2024 నవంబర్ 11న ఝుహాయ్ నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయట అతను నిర్లక్ష్యంగా కారు నడిపించాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకొని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కోమాలోకి వెళ్లిన ఫాన్ వికియూను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. భార్యతో విడాకులు తీసుకున్న ఫాన్, ఆస్తి పంపకాల్లో అసంతృప్తికి గురై ఇంతటి దారుణానికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది. ఈ ఘటన అత్యంత ఘోరమైనదిగా చైనా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అందుకే అతనికి మరణశిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. అత్యంత హేయమైన ఘటనకు పాల్పడిన ఫాన్‌కు మరణ శిక్ష అమలు చేయడంపై చైనా సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. క్రూరమైన చర్యకు సరైన శిక్ష పడిందని పలువురు వ్యాఖ్యానించారు. జియాంగ్సు ప్రావిన్సులో గత నవంబర్‌లో ఒక యువకుడు కత్తులతో దాడికి పాల్పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. ఈ యువకుడికి కూడా మరణ శిక్ష అమలు చేశారు.

Next Story