- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాతయ్య, నానమ్మ కళ్లెదుటే చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వైరల్
పంజాబ్‌లోని మొహాలీ జిల్లా కురాలిలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. నానమ్మ, తాతయ్య కళ్లెదుటే నాలుగేళ్ల బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పంజాబ్‌లోని మొహాలీ జిల్లా కురాలిలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. నానమ్మ, తాతయ్య కళ్లెదుటే నాలుగేళ్ల బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బాలికను కాపాడుకునేందుకు వృద్ధ దంపతులు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు, దుండగులు వారిని కారుతో తొక్కించేందుకు ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భాదితుల వివరాల ప్రకారం.. పాఠశాల ముగిసిన తర్వాత తాతయ్య, నానమ్మలతో కలిసి చిన్నారి స్కూటీపై ఇంటికి చేరుకుంది. నానమ్మ గేటు తీసేందుకు కిందకు దిగగానే, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తాతయ్య చేతుల్లోంచి బాలికను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఒక తెల్లటి కారు అక్కడికి చేరుకోగా, అందులోంచి వచ్చిన మరికొందరు వ్యక్తులు దుండగులకు సహకరించారు. మనవరాలిని కాపాడుకోవడానికి వృద్ధ దంపతులు తీవ్రంగా శ్రమించారు. కారుకు అడ్డంగా నిలబడి ప్రాణాలకు తెగించి పోరాడారు. అయినప్పటికీ, వారిని ఢీకొట్టేలా కారును వేగంగా ముందుకు పోనిచ్చి దుండగులు చిన్నారిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. వృద్ధుల కేకలు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి కారును వెంబడించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఉదంతం మొత్తం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
కస్టడీ వివాదమే కారణమా?
ఈ కిడ్నాప్ వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలిక తండ్రి.. ఈ ఘటనపై స్పందిస్తూ తన భార్యపైనే సంచలన ఆరోపణలు చేశాడు. ‘నా కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. కానీ, ఇది నా భార్య పనే అని నేను బలంగా అనుమానిస్తున్నాను. మా ఇద్దరి మధ్య పిల్లల కస్టడీకి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. అయినా ఆమె చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టింది.’ అని బాలిక తండ్రి పోలీసులకు వివరించారు. తన భార్యతో పాటు అత్తగారు, సందీప్ కుమార్ అనే మరో వ్యక్తికి ఈ కిడ్నాప్‌తో ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించే పనిలో పడ్డారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.






