CJI Sanjiv Khanna: నా నోట మాటలు రావట్లేదు.. చాలా జ్ఞాపకాలున్నాయి- సీజేఐ జస్టిస్ ఖన్నా

by Shamantha N |

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna) పదవీ విరమణ చేశారు.

CJI Sanjiv Khanna: నా నోట మాటలు రావట్లేదు.. చాలా జ్ఞాపకాలున్నాయి- సీజేఐ జస్టిస్ ఖన్నా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna) పదవీ విరమణ చేశారు. వీడ్కోలు సభలో జస్టిస్ ఖన్నా ప్రసంగించారు. ప్రజల విశ్వాసాన్ని ఆజ్ఞాపించలేమని.. దాన్ని సంపాదించుకోవాలన్నారు. "నా నోట మాట రావట్లేదు. నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మీరొకసారి న్యాయవాది అయితే ఎప్పుడూ అలానే ఉంటారు. న్యాయవ్యవస్థకు ఉన్న ప్రజా విశ్వాసాన్ని ఆజ్ఞాపించలేము. దాన్ని సంపాదించుకోవాలి. బెంచ్ అండ్ బార్ న్యాయవ్యవస్థను సూచిస్తుంది. బార్ అంటేన్ మనస్సాక్షికి ప్రతీక" అని జస్టిస్ ఖన్నా అన్నారు. న్యాయమూర్తులు వివిధ నేపథ్యాల నుండి సుప్రీంకోర్టుకు వస్తారని పేర్కొన్నారు. అది వైవిద్యమే న్యాయవ్యవస్థలో నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందన్నారు. తదుపరి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి తనకు "అతిపెద్ద మద్దతుదారు" అని అన్నారు. ఆయనలో మీరొక గొప్ప సీజేఐని చూస్తారన్నారు. ఆయన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను సమర్థిస్తారని చెప్పుకొచ్చారు. అయితే, అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. , 1971-1977 మధ్య కాలంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన బంధువు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా గురించి మాట్లాడారు. తనను జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాతో పోల్చుకునేందుకు నిరాకరించారు. ఆయన అపారమైన తెలివితేటలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. జస్టిస్ డీవై చంద్రచూడ్‌ పదవీ విరమణతో సీజేఐ జస్టిస్ సంజీవ్‌ ఖన్నా 2024 నవంబర్‌లో భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా భాద్యతలు చేపట్టారు. ఆ పదవిలో కేవలం ఆరు నెలలు మాత్రమే సేవలందించారు.

జస్టిస్ ఖన్నా నేపథ్యం

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)ల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ.. అవి పూర్తి భద్రమైనవని, దాని వల్ల బోగస్‌ ఓట్లు, బూత్‌ల రిగ్గింగ్‌ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఎలక్టోరల్‌ బాండ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఖన్నా కూడా ఉన్నారు. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ తీర్చు ఇచ్చిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే.

తదుపరి సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌..

కాగా, తదుపరి సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌ పేరును సీజేఐ ఖన్నా ఏప్రిల్‌ 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్‌ గవాయ్‌ సీజేఐగా ఆరు నెలలకుపైగా కొనసాగుతారు. 2025 నవంబర్‌ 23న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ కావడం విశేషం. మంగళవారంతో జస్టిస్ పదవీ కాలం ముగిసింది. దీంతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ గవాయ్‌ (Justice BR Gavai) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Next Story