Chennai: చెన్నయ్‌లో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి.. 23 మందికి అస్వస్థత!

by B.Srinivas |

చెన్నయ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి ముగ్గురు మరణించగా 23 మంది అస్వస్థతకు గురైనట్టు అధికారులు తెలిపారు.

Chennai: చెన్నయ్‌లో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి.. 23 మందికి అస్వస్థత!
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాజధాని చెన్నయ్‌(Chennai)లో విషాద ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి ముగ్గురు మరణించగా మరో 23 మంది అస్వస్థతకు గురైనట్టు అధికారులు తెలిపారు. చెన్నయ్‌కి సమీపంలోని పల్లవరంలో గురువారం పలువురు వ్యక్తులు కలుషిత నీరు తాగడంతో వాంతులు, వీరేచనాల వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వారందరినీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది చికిత్స పొందుతున్నారు. అందులోనూ పది మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ (Subramaniyan) ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ ప్రాంతంలోని ప్రజలు పైపుల నీటిని తాగొద్దని సూచించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆర్డర్స్ జారీ చేశారు.

అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌, నీరు కలుషితం కావడం రెండూ ఒకేరకమైన లక్షణాలు ఉన్నాయని, పోస్టుమార్టం తర్వాతే మరణానికి గల కారణాలను గుర్తించొచ్చని వైద్యులు వెల్లడించారు. కానీ స్థానికులు మాత్రం మురుగు నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత పళనిస్వామి స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సురక్షిత నీటిని అందించడంలో అధికార డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాట్లాడుతూ..బాధితులకు న్యాయం చేయాలని, ప్రజలకు సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని కోరారు.

Next Story