పద్ధతి మార్చుకో.. తీవ్ర పరిణామాలుంటాయి: కపిల్ శర్మకు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-03 09:08:04  IST  )

కెనడాలోని సరౌలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి కాల్పులతో విరుచుకుపడింది.

పద్ధతి మార్చుకో.. తీవ్ర పరిణామాలుంటాయి: కపిల్ శర్మకు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కెనడా (Canada)లోని బ్రిటిష్ కొలంబియా స్టేట్ సరౌ (Surrey) నగరంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి కాల్పులతో విరుచుకుపడింది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో ప్రముఖ భారతీయ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చెందిన ‘క్యాప్స్ కేఫ్’ (Kap’s Cafe), పక్కనే ఉన్న ‘చాయ్ సుట్టా బార్’ లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారు. అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌కు చెందిన ‘టైసన్ బిష్ణోయ్ జోరా సిద్ధూ’ అనే ఫేస్‌బుక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా, ఆ పోస్ట్‌లో నేరుగా కపిల్ శర్మకు హెచ్చరికలు జారీ చేయడం సంచలనం రేపుతోంది.

కపిల్ శర్మకు డైరెక్ట్‌ వార్నింగ్..

పద్ధతి మార్చుకో.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బిష్ణోయ్ గ్యాంగ్ కపిల్ శర్మను హెచ్చరించింది. 2025లో ఇప్పటికే కపిల్ కేఫ్‌ (Kapil's Café)పై రెండుసార్లు కాల్పులు జరిగాయని గుర్తు చేస్తూ.. తమ మాట వినకపోతే కెనడాలోని కేఫ్‌తో పాటు ముంబైలోని ఆయన నివాసాన్ని కూడా టార్గెట్ చేస్తామని బెదిరించారు. ఈసారి ఎలాంటి రికమెండేషన్లను తాము అంగీకరించబోమని బిష్ణోయ్ గ్యాంగ్ స్పష్టం చేసింది. కాగా, కపిల్ శర్మ 2025 జూలైలో సరౌలో ఈ కేఫ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజా దాడిలో కపిల్ కేఫ్ పక్కనే ఉన్న అవుట్‌లెట్‌పై కాల్పులు జరిపి, ఆయనను నేరుగా బెదిరించడం ప్రవాస భారతీయులను, కపిల్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఘటనపై కెనడా పోలీసులు కేసు నయోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story