చంద్రుడిపై భారీగా మంచు నిక్షేపాలు

by Ajay Maddhiboyina |

శివశక్తి పాయింట్‌గా పిలవబడుతున్న ల్యాండింగ్ సైట్ వద్ద పగటి పూట ఉష్ణోగ్రతలు 82 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. రాత్రి పూట మైనస్ 170 సెంటీగ్రేడ్‌ల వరకు మారుతోంది.

చంద్రుడిపై భారీగా మంచు నిక్షేపాలు
X

- నీళ్లు ఉండే అవకాశాలు తక్కువే

- చంద్రయాన్-3 డేటాలో ఆసక్తికరమైన అంశాలు

- విశ్లేషించిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్

దిశ, నేషనల్ బ్యూరో: చంద్రుని ధృవాల వద్ద గతంలో ఊహించిన దాని కంటే ఎక్కువగా మంచు నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 రోవర్ 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. శివశక్తి పాయింట్ వద్ద ల్యాండ్ అయిన ఈ విక్రమ్ ల్యాండర్.. అనేక విషయాలను అధ్యయనం చేసింది. చంద్రుడి ఉపరితంల కింది 10 సెంటీ మీటర్ల లోతులో తీసిన ఉష్ణోగ్రతల రీడింగ్స్‌ను భూమిపైకి పంపించింది. వాటిని అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబరోటరీకి చెందిన డాక్టర్ దుర్గా ప్రసాద్ విశ్లేషించారు. చంద్రుని ఉపరితలం కింద, ధృవాలకు సమీపంలో ఎక్కువ ప్రదేశాల్లో మంచు ఉండొచ్చని ఆ డేటాలో తేలింది. స్థానిక ఉష్ణోగ్రతల్లోని వైవిధ్యాలు మంచు ఏర్పడటాన్ని ఏ విధంగా ప్రభావితం ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేశారు. ఈ మంచు కణాలపై అధ్యయనం చంద్రుని భౌగోళిక చరిత్ర, ఇతర పరిస్థితులపై కూలంకష సమాచారాన్ని అందించనుంది.

శివశక్తి పాయింట్‌గా పిలవబడుతున్న ల్యాండింగ్ సైట్ వద్ద పగటి పూట ఉష్ణోగ్రతలు 82 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. రాత్రి పూట మైనస్ 170 సెంటీగ్రేడ్‌ల వరకు మారుతోంది. సూర్యుని నుంచి 14 డిగ్రీల కంటే ఎక్కువ వాలు కలిగిన చంద్రుడి ఉపరితలం వద్ద పరిస్థితులు మంచు పేరుకొని పోయేంతగా చల్లని ఉష్ణోగ్రతలను ఏర్పరచగలవని ఈ అధ్యయనంలో తేలింది. అయితే చంద్రునిపై మంచు భారీగా ఉన్నా.. అది కరిగి ద్రవ రూపంలోకి మారకుండా.. నేరుగా ఆవిరై పోతున్నట్లు డాక్టర్ దుర్గా ప్రసాద్ వివరించారు. అందుకే చంద్రుడిపై భారీగా మంచు ఉన్నా.. నీళ్లు మాత్రం ఉండే అవకాశాలు తక్కువేనని చెప్పారు.

చంద్రుని దక్షిణ ధృవంపై ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే భవిష్యత్‌లో ఇక్కడ వ్యోమోగాములను దింపడం చిక్కులతో కూడుకున్న వ్యవహారమే అని పరిశోధనలో తేలింది. నాసా ప్రణాళికలో ఉన్న అర్టెమిస్ మిషన్‌తో పాటు చంద్రుడిపై భవిష్యత్‌లో జరపబోయే అన్ని మిషన్లపై దీని ప్రభావం ఉంటుందని అన్నారు. చంద్రుడిపై భారీగా లభించే మంచును భవిష్యత్‌లో మానవ ఆవాసానికి ఉపయోగించుకోవచ్చని కూడా పరిశోధకులు తెలిపారు.

Next Story