- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో అల్లర్లకు ఛాన్స్.. హెచ్చరించిన కేంద్ర హోంశాఖ
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆ రాష్ట్రానికి సీఎం ఎవరన్నదానిపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాలు గంటగంటకూ రంగులు మారుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118)కు స్వల్ప దూరంలో ఆగిపోవడంతో హైడ్రామా మొదలైంది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం హెచ్చరికలు, ఇటు ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు, గవర్నర్ రాజభవన్, ఇతర కీలక ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన కూడళ్లలో కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అది తీవ్రమైన శాంతిభద్రతల సమస్యగా మారుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
మొదలైన రిసార్ట్ పాలిటిక్స్
హంగ్ ఏర్పడే సంకేతాలు రావడంతో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే (AIADMK)లో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన సుమారు 27 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టుకు తరలి వెళ్లారు. సీవీ షణ్ముగం నేతృత్వంలో ఆ ఎమ్మెల్యేలంతా రిసార్టులో మకాం వేశారు. విజయ్ (TVK) ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు "విజయ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోము" అని ప్రకటించిన అన్నాడీఎంకే అగ్రనాయకత్వం, ఇప్పుడు ఎమ్మెల్యేల ఒత్తిడితో సందిగ్ధంలో పడింది. మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని భావిస్తుండటంతో పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకారానికి కావలసిన మెజార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉన్నారు. మరి విజయ్ కు ఏయే ఎమ్మెల్యేలు మద్దతిస్తారో, సీఎంగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో వేచి చూడాలి.






