Op Sindoor: పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి నో చెప్పిన కేంద్రం

by Shamantha N |

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత భారత్- పాక్ ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Op Sindoor: పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి నో చెప్పిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత భారత్- పాక్ ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టాయి. అయితే, ఇందుకు కేంద్రం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక సమావేశం (Special Session of the Parliament) ఏర్పాటు చేసేందుకు కేంద్రం సముఖంగా లేదని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వవర్గాలను ఉద్దేశిస్తూ.. జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఏడాది జులైలో జరిగే వర్షాకాల సమావేశాల్లోనే ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఉగ్రదాడి తర్వాత..

ఏప్రిల్ 22న పహెల్గాంలో ముష్కరులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడి (Pahalgam Terror attack)లో 26 మంది అమాయకులు చనిపోయారు. ఇందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అప్పట్నుంచి భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పరిణామాలు, కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ‘‘ఐక్యత, సంఘీభావం అవసరమైన ఈ తరుణంలో, వీలైనంత త్వరగా ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయడం ముఖ్యమని విపక్షం భావిస్తోంది’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు విపక్ష ఎంపీలు సైతం ఇదే డిమాండ్‌ వినిపించారు. అయితే, ప్రత్యేక సమావేశం చేపట్టేందుకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది.

Next Story