- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Deep Fake video : డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి వీడియోల నియంత్రణకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా, ఏఐ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందడం సమాజానికి ప్రమాదకరని అన్నారు. మరో పది రోజుల్లో కొత్త నియంత్రణ మార్గదర్శకాలను రూపొందిస్తాం. అందుకోసం ఇప్పటికే ఉన్న చట్టాల్ని సవరించడం లేదంటే కొత్త నియమాలు, కొత్త చట్టాన్ని తీసుకురావడం కూడా ఉండవచ్చన్నారు. సోషల్ మీడియా సంస్థలు, నాస్కామ్, ఏఐ నిపుణులతో జరిగిన సమావేశంలో ప్రధానంగా డీప్‌ఫేక్‌లను గుర్తించడం, పోస్టింగ్ అవకుండా కట్టడి చేయడం, వైరల్ కాకుండా నియంత్రించడం, రిపోర్టింగ్ గురించి చర్చించినట్టు మంత్రి వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, డీప్‌ఫేక్ వీడియోల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, మీడియా కలిసి పనిచేయాలన్నారు. డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించే వారికి, వాటి వ్యాప్తికి కారణమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు భారీ జరిమానా విధించాలని భావిస్తున్నట్టు చెప్పారు.
వచ్చె నెలలో మరోసారి సోషల్ మీడియా సంస్థలతో భేటీ ఉంటుందని, నేడు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష అనంతరం మరిన్ని చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతేకాకుండా డీప్‌ఫేక్ వీడియోల నియంత్రణకు మార్గదర్శకాల్లో ఎటువంటి అంశాలను చేర్చాలనే దానిపై చర్చ జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యానికి డీప్‌ఫేక్ వీడియోలు కొత్త ముప్పుగా మారుతున్నాయని, వీటిపై తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల సినీనటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్, సచిన్ టెండుల్కర్ కుమార్తె సారాలకు చెందిన డీప్‌ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం తాను కూడా ఇలాంటి వీడియోల బాధితుడినని చెప్పడం సమస్య తీవ్రత పెరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం పరిష్కార చర్యలు ప్రారంభించింది.