Justice Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానంపై మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి

by S Gopi |

100 మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఇప్పటికే ఈ తీర్మానంపై సంతకం చేశారని ధృవీకరించారు.

Justice Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానంపై మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: సోమవారం నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానం తీసుకువస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. 100 మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఇప్పటికే ఈ తీర్మానంపై సంతకం చేశారని ధృవీకరించారు. ఏరోజు వస్తుందనే విషయాన్ని చెప్పలేనప్పటికీ, దానిపై ఖచ్చితమైన నిర్ణయం వచ్చిన తర్వాత తెలియజేస్తామని తెలిపారు. అయితే ఒక హైకోర్టు జడ్జిని తొలగించడం అంత సులభమైన విషయం కాదు, దీనికి చాలా కఠిన ప్రక్రియ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్‌ సిబ్బందికి ఆయన ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు లభించాయి. ఈ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చకు దారితీయడంతో అప్పటి సీజేఐ జస్టిస్‌ సంజీవ్ ఖన్నా విచారణ కమిటీని నియమించింది. 10 రోజుల అనంతరం జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని కమిటీ నిర్ధారించింది. రిపోర్టు ఆధారంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మే 8న ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి లేఖ రాశారు. దీని ఆధారంగానే ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాల్లో జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రక్రియ ఎలాగంటే..

కానీ, ఈ ప్రక్రియ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్-1968 ప్రకారం జరగాలి. ఇది అనేక దశల్లో కఠినంగా ఉంటుంది. ముందుగా పార్లమెంట్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాక, కనీసం 100 మంది సభ్యులు సంతకం చేసిన నోటీసులు స్పీకర్‌కు అందజేయాలి. రాజ్యసభలో కనీసం యాభై మంది సభ్యుల సంతాకంతో ఛైర్మన్‌కు ఇవ్వాలి. ఆ తర్వాత దాన్ని ఆమోదించాక స్పీకర్ లేదా ఛైర్మన్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు ఆదేశిస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా సీజేఐ, ఏదైనా ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయ నిపుణుల్లో ఒకరు ఉంటారు. ఈ కమిటీ విచారణ జరిపి సాక్ష్యాలను సేకరించడమే కాకుండా, సదరు న్యాయముర్తి వాదనను కూడా వింటుంది.

అనంతరం స్పీకర్ లేదా ఛైర్మన్‌కు నివేదిక ఇచ్చాక, ఆరోపణలు నిజమని తేలితే అభిశంసన తీర్మానపై పార్లమెంటులో చర్చ నిర్వహిస్తారు. ఆ తర్వాత మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లతో సంభలో తీర్మానం ఆమోదం పూర్తయితే మరొక సభకు పంపుతారు. రెండు సభల్లోనూ ఆమోదించాక రాష్ట్రపతి వద్దకు చేరుస్తారు. ఆ తర్వాతే సదరు న్యాయమూర్తిని తొలగించేందుకు వీలవుతుంది.

Next Story