నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం అప్రమత్తం.. మెటా, గూగుల్, టెలిగ్రామ్‌లకు ఆదేశాలు

by Kema Shiva Kumar |

నీట్ (NEET UG) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ‘పేపర్ లీక్’ పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం అప్రమత్తం.. మెటా, గూగుల్, టెలిగ్రామ్‌లకు ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ నిర్వహణకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ముందు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే నకిలీ ‘క్వశ్చన్ పేపర్ లీక్’ (Question Paper Leak) పోస్టులకు, విద్యార్థులను మోసం చేసే ముఠాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లూన మెటా ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్, టెలిగ్రామ్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చేతులు కలిపింది.

ఫేక్ గ్రూపులు, చానల్స్‌పై నిఘా..

అయితే, ఇటీవల జరిగిన నీట్ పరీక్షల సమయంలో సోషల్ మీడియా వేదికగా.. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపులలో క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు జరిగాయి. నకిలీ ప్రశ్నపత్రాలను చూపిస్తూ కొందరు కేటుగాళ్లు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి మోసగించారు. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) సంయుక్తంగా సదరు సోషల్ మీడియా సంస్థలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాయి.

ఈ తాజాగా ఒప్పందం ప్రకారం.. నీట్ పరీక్షకు సంబంధించి ‘పేపర్ లీక్’, ‘ప్రశ్నపత్రాలు విక్రయించబడును’ అంటూ వచ్చే ఎలాంటి పోస్టులనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రత్యేక నిఘా ద్వారా ఈ సంస్థలు తక్షణమే గుర్తించనున్నారు. అక్రమంగా ప్రశ్నపత్రాలు అమ్ముతున్నామనే ఫేక్ చానల్స్, గ్రూపులను వెంటనే డిలీట్ చేయనున్నారు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో విద్యార్థులను తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను బ్లాక్ చేయడంతో పాటు, ఆయా అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Next Story