మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం వైఖరేంటో చెప్పాలి: జైరాం రమేశ్

by Harish |

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం వైఖరేంటో చెప్పాలి: జైరాం రమేశ్
X

న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ రెండో సెషన్‌లోనైనా ఈ బిల్లును ఆమోదించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకురాలు కె. కవిత నిరాహార దీక్ష చేసిన సందర్భంగా కాంగ్రెస్ ఈ ప్రకటన విడుదల చేసింది. బడ్జెట్ రెండో సెషన్ ఈ నెల 13న ప్రారంభం కానుంది. ‘పూర్తిగా కాంగ్రెస్ నాయకత్వ కృషి వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లును 2010 మార్చి 9వ తేదీన రాజ్యసభ ఆమోదించింది. కానీ లోక్‌సభలో మద్దతు లభించడం లేదు. బిల్లు సమయం ఇంకా మిగియలేదు. కానీ పెండింగ్‌లో ఉంది. బిల్లును ఆమోదించడానికి అడ్డు వస్తున్న కారణాలేంటి?’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ బిల్లుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా సమాధానమిస్తూ.. రాజ్యసభలో బిల్లును ఆమోదించారు, లోక్‌సభలో కాంగ్రెస్‌కు మెజారిటీ లేదని చెప్పారు. ‘రాజ్యసభలో బిల్లును ఆమోదింప చేసుకోవడంలో మేము విజయవంతమయ్యాం. ఈ బిల్లు ఇంకా సజీవంగా ఉంది. కానీ రాజ్యసభలో మాకు మెజారిటీ లేదు. బీజేపీకి ఉంది. మహిళలకు 39 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్లు చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా మౌనంగానే ఉన్నారు.

పార్లమెంట్‌లో బడ్జెట్ రెండో సెషన్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని కోరుతున్నాం. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం’ అని లాంబా చెప్పారు. పార్లమెంట్ రెండో సెషన్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6న ప్రారంభం కానున్నాయి.

Next Story