- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివారమే కేంద్ర బడ్జెట్.. ఈ నెల 28న బడ్జెట్ సమావేశాలు!
ఆదివారమే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నెల 28న బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నారట.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారమే ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రతియేటా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆ రోజు ఆదివారం కావడంతో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారా? బడ్జెట్ ప్రవేశపెడతారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై బుధవారం నాడు పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. జనవరి 28న రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ మరుసటి రోజు 29వ తేదీన ఎకనామిక్ సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 30, 31 తేదీల్లో పార్లమెంటుకు సెలవులిచ్చి, ఫిబ్రవరి 1న తిరిగి సమావేశమై బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ విషయంపై సీసీపీఏ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు. భారత దేశపు తొలి మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్.. గతేడాది 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచంలో అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ ఆమెకు 9వది కావడం గమనార్హం. ఇప్పటి వరకు భారత దేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఉన్నారు. రెండు టర్మ్‌లు ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఆయన 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు.






