చండీగఢ్ ప్రతిపాదనపై వెనక్కు తగ్గిన కేంద్రం

by Phanindra |

చండీగఢ్ ప్రతిపాదనపై వెనక్కు తగ్గిన కేంద్రం. పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకతతో నిర్ణయం.

చండీగఢ్ ప్రతిపాదనపై వెనక్కు తగ్గిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను ఆర్టికల్ 240 కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో.. తాము కేవలం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు పీఐబీ-హోం మినిస్ట్రీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. అలాగే ఈ ప్రతిపాదన చండీగఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసే విధానాన్ని సులభతరం చేసేందుకేనని, దీని వల్ల చండీగఢ్‌తో పంజాబ్, హర్యానా సంబంధాలు, హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వివరించింది.

ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనకే పరిమితమైందని స్పష్టంచేసింది. ఈ తాజా ప్రతిపాదనతో సొంత ప్రభుత్వాలు లేని కేంద్రపాలిత ప్రాంతాల సరసన చండీగఢ్‌ను చేర్చనున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ సహా పలు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. చండీగఢ్ తమకే చెందాలని ఈ రాష్ట్రం ఎప్పటి నుంచో పోరాడుతోంది. తాజా చర్యతో ఈ పోరాటాన్ని నీరుగార్చేందుకే కేంద్రం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

కేంద్రం ప్రతిపాదన ఏంటి?

ప్రస్తుతం చండీగఢ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఆ అధికారం పంజాబ్ గవర్నర్‌కు మాత్రమే ఉంది. హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాలకూ చండీగఢ్ రాజధాని కావడంతో ఏ ప్రభుత్వమూ చండీగఢ్ పాలనలో జోక్యంచేసుకునే అవకాశం లేదు. కేవలం పంజాబ్ గవర్నర్ మాత్రమే చండీగఢ్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే రాజ్యాంగ 131వ సవరణ బిల్లుతో చండీగఢ్‌ను ఆర్టికల్ 240 కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతో చండీగఢ్ పాలనా వ్యవహారాలన్నీ నేరుగా రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్తాయి. దీనిపై పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

Next Story