ఎన్ఐఏ చీఫ్ సదానంద్ దాతేపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Malleboina Mahesh |

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్, 1990 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతేను ఆయన మాతృ కేడర్ అయిన మహారాష్ట్రకు వెనక్కి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఎన్ఐఏ చీఫ్ సదానంద్ దాతేపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్, 1990 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతేను ఆయన మాతృ కేడర్ అయిన మహారాష్ట్రకు వెనక్కి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ పంపిన 'ప్రిమెచ్యూర్ రిపాట్రియేషన్' ప్రతిపాదనను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర నియామక కమిటీ (ACC) ఆమోదించింది. ప్రస్తుతం మహారాష్ట్ర డీజీపీగా ఉన్న రష్మీ శుక్లా పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండటంతో, తదుపరి రాష్ట్ర పోలీసు బాస్ (DGP)గా దాతేను నియమించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సదానంద్ దాతే కేవలం ఉన్నతాధికారి మాత్రమే కాదు. 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో కమా ఆసుపత్రిలో ఉగ్రవాదులను ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్న ధైర్యశాలి. ఆ సాహసానికి గుర్తింపుగా ఆయన ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ’ని అందుకున్నారు. ఏప్రిల్ 2024లో ఎన్ఐఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, వాస్తవానికి 2026 డిసెంబర్ వరకు ఆ పదవిలో ఉండాల్సి ఉంది. అయితే, రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఏడాది ముందుగానే కేంద్రం ఆయనను విముక్తి చేయడంతో, త్వరలోనే ఆయన మహారాష్ట్ర డీజీపీగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.


Next Story