ఈ20తో మైలేజి తగ్గుతుంది.. ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం!

by Phanindra |

ఈ20తో మైలేజి తగ్గుతుందని, కొన్ని వాహనాల్లో 3-5 శాతం మైలేజీ తగ్గొచ్చునని కేంద్రం ఒప్పుకుంది.

ఈ20తో మైలేజి తగ్గుతుంది.. ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఈ20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇటీవలి కాలంలో ఈ20 పెట్రోల్‌ వల్ల జరిగే నష్టాలు, ప్రభుత్వం తీరుపై లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్రం రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. ఈ20 ప్రాజెక్టు ఊపందుకున్న సమయంలోనే చాలా తప్పుడు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయని, ఇలాంటి అవాస్తవాలను ప్రజలు నమ్మకూడదని పెట్రోలియం శాఖ తెలిపింది. శాస్త్రీయ ప్రమాణాలతో ఈ20 తయారవుతోందని, ఈ ఇంధనం క్వాలిటీని బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) పర్యవేక్షిస్తోందని, ఈ ఇంధనం వల్ల ఎలాంటి నష్టం ఉండదని పేర్కొంది. ఆధారాలు లేని అబద్ధపు వార్తలను ప్రజలు నమ్మొద్దని, ఈ20 వాడటం వల్ల చమురు దిగుమతులు తగ్గడంతోపాటు ఎయిర్ క్వాలిటీ మెరుగవుతుందని, భారత్ ఎనర్జీ రంగానికి భద్రత దొరకడంతోపాటు రైతాంగానికి మరో ఆదాయ మార్గం లభిస్తుందని తెలియజేసింది.

ఈ20 విషయంలో తొందరపడ్డారా?

సాధ్యమైనంత వేగంగా ఈ20ని అమలు చేయాలనే ఆలోచనతో ఇథనాల్ బ్లెండింగ్ విషయంలో కేంద్రం తొందరపడిందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం ఖండించింది. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే పైలట్ ప్రాజెక్టులు 2001లోనే ప్రారంభమయ్యాయని, 2013లో పాలసీ నోటిఫికేషన్ జరిగిందని, 2018లో చట్టపరమైన సవరణలు జరిగాయని, 2021 నుంచి భారీగా పెట్టుబడులు జరుగుతున్నాయని వెల్లడించింది. 2006లోనే ఈ5 పెట్రోల్‌ను అందించడం ప్రారంభించగా.. 2022 నాటికి ఈ10 లక్ష్యాన్ని భారత్ అందుకుందని, 2025లో ఈ20 టార్గెట్ చేరుకుందని పేర్కొంది. భద్రత, సాంకేతికతలో ఎలాంటి కాంప్రమైజ్‌కు తావులేకుండా మెరుగైన వ్యూహాలు, గవర్నెన్స్‌తోనే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం ముందుకు సాగిందని స్పష్టంచేసింది.

ప్యూర్ పెట్రోల్, ఈ10, ఈ20.. మూడు ఎందుకు అందుబాటులో లేవు?

ప్రజలు తమకు కావలసిన పెట్రోల్‌ను ఎంచుకునేందుకు 100 శాతం పెట్రోల్, ఈ10, ఈ20 మూడు రకాలు అందుబాటులో ఉంచాలనే డిమాండ్‌పై కేంద్రం వివరణ ఇచ్చింది. దేశంలో ఉన్న లక్షపైగా పెట్రోల్ పంపులు, డిపోలు, టర్మినల్‌లు, పైప్‌లైన్లలో మూడు రకాల పెట్రోల్‌ అందుబాటులో ఉంచాలంటే భారీగా లాజిస్టికల్ సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. అలాంటప్పుడు మూడు వేర్వేరు ఇంధన సప్లయ్ చైన్లను ఉంచడం ప్రాక్టికల్‌ కాదని స్పష్టంచేసింది.

మరి ఈ20 ధరలు ఎందుకు తగ్గలేదు?

ఇథనాల్ కలిపినా కూడా పెట్రోల్ ధరలు తగ్గకపోవడంపై కూడా కేంద్రం బదులిచ్చింది. ఇథనాల్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరుగుతూ వస్తోందని, ఈ ఆదాయాన్ని రైతులకు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ఇథనాల్ ధరలు తగ్గడం లేదని వివరించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల చేరువలో ఉంటే ఈ20 పెట్రోల్ ఉత్పత్తికే ఎక్కువ ఖర్చవుతుందని తెలిపింది. ప్రస్తుతం లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి రూ.71.86 ఖర్చవుతోందని వెల్లడించింది. అయితే గ్లోబల్ అనిశ్చితుల వేళ ముడిచమురు ధరలు భారీగా పెరిగితే.. ఆ ప్రభావం దేశంలోని పెట్రోల్‌పై పడకుండా ఉంటుందని తెలియజేసింది. అదే సమయంలో ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా చమురు దిగుమతులు తగ్గుతాయని, విదేశీ మారక నిల్వలను కాపాడుకోగలుగుతామని వివరించింది. ఈ20 వాడటం వల్ల ప్రతి పెట్రోల్ ట్యాంకులోని చమురులో 20 శాతంపై అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం ఉండదంది.

పాత వాహనాలు డ్యామేజ్ అవుతాయా?

ఈ20 పెట్రోల్‌ను అందుబాటులో తెచ్చే ముందు వాహన తయారీదారులు, టెస్టింగ్ ఏజెన్సీలు, టెక్నికల్ నిపుణులతోపాటు సంబంధిత అన్ని వర్గాలతో చర్చలు జరిపినట్లు కేంద్రం తెలిపింది. ఇంధన వ్యవస్థలు, పెట్రోల్ సామర్థ్యంలో లోపాలుంటే తయారీ కంపెనీలు ఈ మార్పునకు ఒప్పుకునేవి కాదని, లేదా వారంటీలను అంగీకరించేవి కావని పెట్రోలియం శాఖ పేర్కొంది. దీనికి ఉదాహరణగా మారుతీ సుజుకు కంపెనీ లెక్కలకు వెల్లడించింది. ఈ20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుతీ సుజుకి సుమారు 2.5 కోట్ల వాహనాలను సర్వీస్ చేసిందని, వీటిలో 1.5 కోట్ల వరకు పాత వాహనాలేనని తెలిపింది. ఈ వెహికిల్స్‌కు ఈ20 కంపాటిబిలిటీ సర్టిఫికెట్లు లేవని చెప్పిన కేంద్రం.. ఒకవేళ ఈ20 వల్ల ఈ వాహనాలకు డ్యామేజ్ జరిగితే ఇప్పటికే లక్షల్లో వారంటీ క్లెయిమ్‌లు, వాహనాల్లోని విడిభాగాల డ్యామేజీలు జరిగేవని, దేశవ్యాప్తంగా భారీస్థాయిలో ఫిర్యాదులు అందేవని పేర్కొంది. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదని గుర్తుచేసింది. అలాగే కొన్ని వాహనాల మాన్యువల్స్‌లో ‘ఈ10 కంపాటిబుల్’ అని ఉండటం కూడా కన్ఫ్యూజన్‌కు కారణమైందన్న కేంద్రం.. అప్పుడు మార్కెట్లో ఉన్న ఇంధనానికే సర్టిఫికెట్లు వస్తాయని, ఆ తర్వాత శాస్త్రీయ విధానాల్లో మెరుగైన ఇంధనాలు వచ్చినప్పుడు కొత్త సర్టిఫికెట్లు రావడం సహజమేనని తెలిపింది. అంతేకానీ సర్టిఫికెట్లు ఉంటేనే కంపాటిబుల్ అనే లాజిక్ అనుసరిస్తే అప్పటికే ఉన్న ఇంధన ప్రమాణాలను ఏ దేశమూ మెరుగుపరచుకోలేదని వివరించింది.

మైలేజ్ తగ్గుతుందా?

ఈ20 వాడటం వల్ల వాహనాల మైలేజీలో కొంత తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ అంగీకరించింది. కొన్ని వాహనాల్లో 3-5 శాతం మైలేజ్ తగ్గొచ్చని, కానీ ఈ20 వల్ల మెరుగైన ఆక్టేన్ రేటింగ్, యాంటీ నాక్ లక్షణాలు, వేగవంతమైన దహనం, మెరుగైన పికప్, స్మూత్ యాక్సిలరేషన్, క్లీన్ ఇంజిన్ ఆపరేషన్ అందుతుందని పెట్రోలియం శాఖ తెలిపింది. అలాగే ఈ20 వల్ల వాహనాల జీవితకాల కార్బన్ ఉద్గారాలు కూడా సుమారు 40 శాతం తగ్గుతాయని వివరించింది. వీటితో పోల్చినప్పుడు తగ్గే మైలేజీ చాలా తక్కువని అభిప్రాయపడింది.

Next Story