రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. 982 మంది పోలీసులకు అవార్డులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-25 08:10:41  IST  )

2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్ & సివిల్ డిఫెన్స్ (HG&CD), కరెక్షనల్ సర్వీసులకు చెందిన మొత్తం 982 మంది సిబ్బందికి కేంద్రం గ్యాలంట్రీ, సేవా పతకాలు ప్రకటించింది.

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. 982 మంది పోలీసులకు అవార్డులు
X

దిశ, వెబ్‌డెస్క్: 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్ & సివిల్ డిఫెన్స్ (HG&CD), కరెక్షనల్ సర్వీసులకు చెందిన మొత్తం 982 మంది సిబ్బందికి కేంద్రం గ్యాలంట్రీ, సేవా పతకాలు ప్రకటించింది. ప్రాణాలు, ఆస్తి రక్షణ, నేర నిరోధం, నిందితుల అరెస్టుల్లో అసాధారణ ధైర్యసాహసాలు, దీర్ఘకాలిక విశిష్ట సేవలందించిన అధికారులకు ఈ గౌరవాలు దక్కాయి.

గ్యాలంట్రీ మెడల్స్‌కు 125 మంది ఎంపిక

ఈసారి మొత్తం 125 మంది గ్యాలంట్రీ మెడల్స్ కు ఎంపికయ్యారు. పోలీస్ సిబ్బందికి 121, ఫైర్ సర్వీస్ సిబ్బందికి 4 గ్యాలంట్రీ మెడల్స్ లభించాయి. ప్రాణాపాయం లెక్కచేయకుండా ప్రాణాలు, ఆస్తిని కాపాడడం, నేరాలను అడ్డుకోవడం, నేరస్తులను పట్టుకోవడంలో చూపిన అరుదైన ధైర్యసాహసాలకు ఈ పతకాలు అందజేస్తారు.

ప్రాంతాల వారీగా చూస్తే.. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రభావిత ప్రాంతాల నుంచి 35 మంది, జమ్మూ కశ్మీర్ నుంచి 45 మంది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఐదుగురు, ఇతర ప్రాంతాల నుంచి 40 మంది గ్యాలంట్రీ పతకాలకు ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్రెడ్డి గ్యాలంట్రీ అవార్డును అందుకోనున్నారు.

విశిష్ట సేవలకు 101 రాష్ట్రపతి పతకాలు

విశిష్ట సేవా రికార్డుకు ఇచ్చే ఈ పతకాల్లో పోలీస్ సర్వీస్‌కు 89, ఫైర్ సర్వీస్‌కు 5, సివిల్ డిఫెన్స్ & హోంగార్డ్‌కు 3, కరెక్షనల్ సర్వీస్‌కు 4 ప్రెసిడెంట్ మెడల్స్ లభించాయి. వీరిలో ఏపీకి చెంది ఏఎస్పీ ఆర్ఎంకే తిరుమలాచారి, తెలంగాణకు చెందిన అడిషినల్ ఎస్పీ జీఎస్ ప్రకాశ్ రావు, ఎస్ఐ దామోదర్ రెడ్డి ఉన్నారు.

మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (MSM) – 756

నిబద్ధత, కర్తవ్యనిష్ఠతో విలువైన సేవలందించిన వారికి ఇచ్చే ఈ పతకాల్లో పోలీస్ సర్వీస్‌కు 664, ఫైర్ సర్వీస్‌కు 34, సివిల్ డిఫెన్స్ & హోంగార్డ్‌కు 33, కరెక్షనల్ సర్వీస్‌కు 25 పతకాలు ప్రదానం చేశారు.

ప్రమాద ప్రాంతాల్లో అసాధారణ ధైర్యం

ఈ ఏడాది గ్యాలంట్రీ పతకాలు పొందినవారిలో ఎక్కువ మంది అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో విధులు నిర్వహించినవారే కావడం విశేషం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రభావిత ప్రాంతాలు, జమ్మూ–కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల భద్రత కోసం పోరాడిన సిబ్బందికి ఈ గౌరవాలు లభించాయి.

సేవే పరమావధి – కేంద్ర ప్రభుత్వం

ప్రాణాపాయం ఎదురైనా కర్తవ్యాన్ని విస్మరించని భద్రతా బలగాల ధైర్యసాహసాలు దేశానికి గర్వకారణమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేసే పోలీస్, ఫైర్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సిబ్బంది సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదని పేర్కొంది.

READ MORE ....

గణతంత్ర దినోత్సవ వేళ మావోయిస్టుల కుట్ర భగ్నం

Next Story