ECI: ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-07-23 09:10:00  IST  )

తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఈసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.

ECI: ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో తదుపరి వైస్ ప్రెసిడెంట్ (New Vice President) ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ ఈసీవో (Election Commission of India) కీలక ప్రకటన చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి.పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈ ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఈసీ ఇప్పటికే 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు. ఇందులో భాగంగా లోక్‌సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదిస్తోందని, రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

నెలరోజుల్లో పూర్తి..

ఈ సన్నాహక చర్యలు పూర్తయ్యాక, ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా నెల రోజుల్లో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని తెలుస్తోంది. కాగా అనారోగ్య సమస్యలతో మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయగా నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ధన్ ఖడ్ రాజీనామా ఆమోదానికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తన ప్రకటనలో ప్రస్తావించింది.

Next Story