APY: కేంద్ర కేబినెట్ శుభవార్త.. నెలకు రూ.5000 పెన్షన్ ఇచ్చే స్కీమ్‍పై కీలక నిర్ణయం

by Prasad Jukanti |

అటల్ పెన్షన్ యోజన పథకంపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

APY: కేంద్ర కేబినెట్ శుభవార్త.. నెలకు రూ.5000 పెన్షన్ ఇచ్చే స్కీమ్‍పై కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వీరికి నెల నెల పెన్షన్ అందించేందుకు తీసుకు వచ్చిన అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏపీవై స్కీమ్ ను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ పథకానికి మరింత విస్తృత ప్రచారం కల్పించడం, అభివృద్ధికి కృషి చేయాలని అందుకు తగిన నిధులు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు 60 ఏళ్లు దాటాక పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో ఈ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. 2026 జనవరి 19 నాటికి ఈ పథకంలో 8.68 కోట్ల మంది చందాదారులుగా చేరినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.

ఈ స్కీమ్ లో చేరడం ఎలా:

18-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ స్కీమ్‍ లో చేరేందుకు అర్హులు. ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారు పోస్ట్ ఆఫీస్, లేదా ఏదైనా ప్రభుత్వం రంగ బ్యాంక్ ఖాతాలో గానీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ స్కీమ్ లో చేరేవారు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 పెన్షన్ పొందుకునేలా ఏదో ఓ స్లాబ్ ఎంచుకోవాలి. చందాదారులు ఎంచుకున్న పెన్షన్ మొత్తం, పథకంలో చేరినప్పటి వయసును బట్టి తాము చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం మారుతుంది. ఎంత త్వరగా (తక్కువ వయసులో) చేరితే ప్రీమియం అంత తక్కువగా చెల్లించాల్సి వస్తుంది. కాగా అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించేవారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు.

Next Story