నీట్ పేపర్ లీక్.. సీబీఐ కేసు నమోదు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-12 16:13:33  IST  )

నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐ కేసు నమోదు చేసింది.

నీట్ పేపర్ లీక్.. సీబీఐ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ - యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2024లో జరిగినట్లే.. ఇప్పుడు కూడా పేపర్ లీకవ్వడంతో.. విద్యార్థిలోకం తమకు న్యాయం చేయాలని గగ్గోలు పెడుతోంది. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ పై కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, దొంగతనం, సాక్ష్యాధారాలు నాశనం వంటి సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అలాగే అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం -2024 లోని నిబంధనలను కూడా సీబీఐ ఈ కేసులో చేర్చి.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఏజెన్సీ.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విచారించేందుకు అధికారుల్ని కూడా పంపినట్లు సమాచారం.

వారం లేదా 10 రోజుల్లో రీ ఎగ్జామ్ షెడ్యూల్..

మే 3వ తేదీన దేశవ్యాప్తంగా NEET UG 2026 పరీక్ష జరగ్గా.. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పేపర్ లీక్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో మంగళవారం ఉదయం పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా సీబీఐని కోరింది. పరీక్ష రద్దుకు NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ బాధ్యత వహించారు. వచ్చే వారం లేదా 10 రోజుల్లోగా పరీక్షను తిరిగి నిర్వహించే షెడ్యూల్ ను ప్రకటిస్తామని వెల్లడించారు. మెడికల్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ కు ఎలాంటి ఆటంకం లేకుండా వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల నుంచి రీ ఎగ్జామినేషన్ కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఈ కేసులో మహారాష్ట్రలోని నాశిక్ లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. సీబీఐ రంగంలోకి దిగి.. పేపర్ లీకులో కీలక ఆధారాలను సేకరించే పని చేపట్టనుంది.

Next Story