- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా కట్టడికి కేంద్రం మాస్టర్ ప్లాన్.. ఆ శాఖలకు కూడా 'బ్లాకింగ్' పవర్స్
నకిలీ వార్తలు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను తక్షణమే బ్లాక్ చేసే అధికారాలను రక్షణ, ఆర్థిక వంటి ఇతర మంత్రిత్వ శాఖలకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించే యోచనలో ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకు పెరిగిపోతున్న సోషల్ మీడియా వినియోగంతో పాటు నకిలీ వార్తలు, (Fake News), ప్రమాదకరమైన డీప్‌ఫేక్ (Deepfake) కంటెంట్ కొత్త భయాలను పుట్టిస్తోంది. ముఖ్యంగా సున్నితమైన మహిళల భద్రతా, ఆర్థిక వ్యవహారాలు, రక్షణ రంగానికి సంబంధించిన అంశాల్లో డీప్‍ఫేక్‍లు హద్దుదాటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్ వేస్తోంది. త్వరలోనే సోషల్ మీడియాలోని ఫేక్, తప్పుడు కంటెంట్ కట్టడి అధికారాలను ఇతర శాఖలకు విస్తరించబోతున్నది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, 2000లోని సెక్షన్ 69A కింద కంటెంట్ బ్లాకింగ్ అధికారం కేవలం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉంది. కానీ వీటిని ఇతర శాఖలకు విస్తరించే యోచనలో ఉన్నామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
ఎందుకీ మార్పు?:
అశ్విని వైష్ణవ్ ఈ విషయంపై మాట్లాడుతూ డీప్‌ఫేక్ కంటెంట్ వేగంగా వైరల్ అవుతూ దేశ భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి నకిలీ కంటెంట్‌ను గుర్తించి ఫ్యాక్ట్-చెక్ చేసిన తర్వాత, అది ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించాలంటే వేగవంతమైన చర్యలు అవసరం. అందుకే అధికారాలను వికేంద్రీకరిస్తున్నామని ఆయన వివరించారు. ఇటీవల మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేకు సంబంధించిన ఒక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆయన భారత సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఉన్న ఆ వీడియోను పాక్ ప్రచార ఐడీలు బాగా వైరల్ చేశాయి. దీనిని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసిన నకిలీది అని తేల్చింది. అయితే ఇది తప్పడు సమాచరం అని రక్షణ శాఖ గుర్తించినా బ్లాక్ చేసే అధికారం లేకపోవడంతో అప్పటికే పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖ వంటి ఇతర కీలక విభాగాలకు కూడా నేరుగా ఆర్డర్లు జారీ చేసే అధికారం ఇవ్వాలని అంతర్-మంత్రిత్వ బృందం ప్రతిపాదించిందని మంత్రి వెల్లడించారు. ఈ మార్పు కోసం ఐటీ చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదని కేవలం అమలులో ఉన్న నిబంధనలను (Rules) సవరిస్తే సరిపోతుందని మంత్రి తెలిపారు.






