- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంట గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన
దేశంలో ఎల్‌పీజీ కొరత లేదని రెండు గ్యాస్ నౌకలు భారత్‌కు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కొరతపై (LPG Crisis India) తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ సంక్షోభంపై (Gas Cylinder Supply) కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ విషయంలో కొంత మంది ఫేక్, ఏఐ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా విషయంపై ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పటివరకు దేశంలో ఎక్కడా గ్యాస్ స్టాక్ అవుట్ నమోదు కాలేదని ఆమె తెలిపారు. ప్రజల్లో భయంతో ముందస్తుగా బుకింగ్‌లు చేసుకునే పరిస్థితి పెరుగుతుండటం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. నిన్న ఒక్కరోజే 83 లక్షల గ్యాస్ బుకింగ్స్ జరిగాయాని తెలిపారు.
హార్మూజ్‍ను దాటిన రెండు నౌకలు
హార్మూజ్ జలసంధిని దాటుకుని 46 వేల టన్నుల ఎల్పీజీ లోడ్ తో రెండు నౌకలు ఇండియాకు వస్తున్నాయని తెలిపారు. ఈ నౌకలు మార్చి 16,17 తేదీల్లో భారత్ చేరుకుంటాయని చెప్పారు. బ్లాక్ మార్కెట్‍ను నిరోధించేందుకు తనిఖీలు జరుగుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమాసియా దేశాధినేతలతో మాట్లాడుతున్నారని చెప్పారు. దేశీయంగా 31 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచామని, దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా జరుగుతోందన్నారు. అవసరానికి మించి బుకింగ్‌లు చేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు.
కమర్షియల్ వినియోగదారులకు గ్యాస్:
కమర్షియల్ వినియోగదారులందరికి పీఎన్‌జీ (PNG - పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లకు మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. దీనిని వేగవంతం చేసేందుకు గెయిల్ (GAIL) ఇప్పటికే వివిధ గ్యాస్ పంపిణీ సంస్థలతో సమావేశమైందని వీలైనంత త్వరగా అర్హులైన వాణిజ్య వినియోగదారులందరికీ పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. మన వద్ద ముడి చమురు నిల్వలు తగినన్ని ఉన్నాయని మన రిఫైనరీలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ నివేదికలు నమోదు కాలేదని చెప్పారు.
గల్ఫ్‌లో ఇంకా 22 నౌకలు సిద్ధంగా ఉన్నాయి:
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మరో 22 భారతీయ జెండా కలిగిన నౌకలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. వీటిలో మొత్తం 611 మంది భారతీయ నావికులు ఉన్నారని, వారి భద్రతను డీజీ షిప్పింగ్ నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితిని బట్టి మరిన్ని నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.






